ఎవరీ క్రెయిగ్ హామిల్టన్ పార్కర్? 2026 భవిష్యవాణి ఇదేనట
తాజాగా తన యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేసిన టాప్ 5 వార్నింగ్ లు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
By: Garuda Media | 26 Feb 2026 1:00 PM ISTజరగబోయే అంశాలను ముందుగా ఊహించి చెప్పే వారు పలువురు కనిపిస్తుంటారు. అందులో అతి కొద్దిమందికి మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఫేమ్ ను సొంతం చేసుకున్నారు క్రెయిగ్ హామిల్టన్ పార్కర్. ప్రపంచ దేశాలు ఇతన్ని కొత్త నాస్ట్రడామస్ అని.. డూమ్ ప్రవక్తగా అభివర్ణిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన ఈ మానసిక నిపుణుడు.. ఆధ్యాత్మిక రచయిత తన భవిష్యవాణిని తరచూ చెబుతుంటారు. తాజాగా ఆయన 2026లో ఎన్ని దరిద్రాలు చోటు చేసుకుంటాయో.. ఈ ఏడాది ఎన్ని సంచలనాలకు నెలవుగా ఉంటుందో చెప్పుకొచ్చాడు.
1954లో జన్మించిన ఈ పెద్ద మనిషి రాణి ఎలిజబెత్ మరణం గురించి..కొవిడ్ 19 మహమ్మారితో పాటు బ్రెక్సిట్ లాంటి అంశాలను ముందే ఊహించిన వైనం ఇతనికిఈ తరహా గుర్తింపునకు కారణమైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తన అంచనాల కోసం ప్రాచీన భారతీయ నాడీ జ్యోతిష్యాన్ని ఉపయోగిస్తానని చెబుతుంటారు. తాజాగా తన యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేసిన టాప్ 5 వార్నింగ్ లు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
1. అమెరికా ఎన్నికల సమయంలో భారీ విపత్తు లేదంటే యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. తద్వారా నిబంధనలకు విరుద్ధంగా తన పదవీ కాలాన్ని ట్రంప్ పొడిగించుకునే వీలుంది.
2. జపాన్ దేశం మొత్తం ఒక ప్రమాదకరమైన గ్యాస్ మేఘంతో కప్పబడే అవకాశం ఉంది
3. ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడులు జరుగుతాయి. ఇవి ప్రపంచ వ్యాప్త ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.
4. గ్రీన్ లాండ్ లోని సహజవనరుల కోసం అమెరికా ఒక పెద్ద ఒప్పందం చేసుకుంటుంది. నాటో బలహీనానికి ఇదో కారణమవుతుంది.
5. భూమికి.. చంద్రుడికి మధ్య నుంచి ఒక భారీ ఉల్క ప్రయాణిస్తుంది. ఇది భూమికి అతి సమీపంగా రావటంతో భారీ సునామీలు.. తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది.
ఇతను చేసిన తాజా భవిష్యవాణిని కొట్టిపారేసే వారున్నారు. సంచలనాలు చెప్పినట్లే చెప్పి అందరిని భయపెడుతున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే.. తాను చెప్పే అంశాలేవీ ప్రజల్నిభయపెట్టే ఉద్దేశం తనకు లేదని.. సానుకూల ఆలోచనలు.. ప్రార్థనలతో తీవ్రత తగ్గించే వీలుందని చెబుతుంటారు. అయితే.. ఆయన అంచనాల్ని పలువురు ఊహలుగా కొట్టిపారేస్తుంటారు.
ఇంతకు ఈ పెద్ద మనిషికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి?ఆయనకు పేరు తెచ్చిన తొలి ఉదంతం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. క్రెయిగ్ హామిల్టన్ పార్కర్ అతని సతీమణి జేన్ లు 1990 ఆరంభంలో బ్రిటన్ లోని మార్నింగ్ టీవీ కార్యక్రమంగా ది బిగ్ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వారు రాబోయే వారంలో జరిగే ఉదంతాలను ముందుగా ఊహించి చెప్పేవారు. అలా ఈ ప్రోగ్రాం ద్వారా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 2016లో బ్రెగ్సిట్ ఉదంతంతో పాటు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప గెలుస్తారంటూ వీరు చెప్పిన అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా వీరికి గుర్తింపు తెచ్చేలా చేసిందని చెప్పాలి.
ఇతను చెప్పే భవిష్యవాణిని ది డైలీ మొయిల్, ద టైమ్స్, ద మిర్రర్ లాంటి బ్రిటిష్ పత్రికలు తరచూ కవర్ చేస్తుంటాయి. బీబీసీ..డిస్కవరీ ఛానెల్, బయోగ్రఫీ ఛానెల్ లాంటి సంస్థలతో కలిసి గతంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇతడికి సొంతంగా ఒక యూట్యూబ్ చానల్ ఉంది. ఇందుతో ఆయన తాను చెప్పాలనుకున్న భవిష్యవాణుల్ని చెబుతుంటారు.
ఇటీవల కాలంలో భారత మీడియాకు చెందిన దిగ్గజ సంస్థలు కూడా ఇతడి అంచనాల్ని క్రమం తప్పకుండా కవర్ చేయటంతో ఆయన ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు. 2026లో భారీ సైబర్ దాడి జరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు.. క్రిప్టో కరెన్సీలు.. ఏఐ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయని.. బ్యాంకులు.. కంపెనీలు.. వ్యక్తుల డేటా దెబ్బతింటుందని పేర్కొన్నారు. ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలని.. క్లౌడ్ మీద మాత్రం ఆధారపడొద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు తీవ్రంగా ఊగిసలాడతాయని.. డిజిటల్ ప్రపంచం కూలితే జీవితాలు ఎలా మారతాయో ఊహించాలని చెబుతున్నాడు. నిజంగానే ఇతడి మాటలు నిజమవుతాయా? లేదా అన్నది పక్కన పెడితే.. ఇతడి అంచనాలు మాత్రం అందరిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
