Begin typing your search above and press return to search.

కమ్యూనిస్టుల్లో అయోమయం!

తెలంగాణా కమ్యూనిస్టుల్లో అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో కేసీయార్ కొట్టిన దెబ్బకు వామపక్షాలకు దిమ్మతిరిగింది.

By:  Tupaki Desk   |   5 Sept 2023 10:21 AM IST
కమ్యూనిస్టుల్లో అయోమయం!
X

తెలంగాణా కమ్యూనిస్టుల్లో అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో కేసీయార్ కొట్టిన దెబ్బకు వామపక్షాలకు దిమ్మతిరిగింది. పొత్తుల విషయంలో చివరినిముషం వరకు ఏమీ చెప్పకుండా తనపాటికి తాను 115 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. అప్పట్లో మరో నాలుగు సీట్లను మాత్రం పెండింగ్ పెట్టారంతే. దాంతో మండిపోయిన కమ్యూనిస్టులు అప్పటినుండి కేసీయార్ అంటే రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ ఓటమే టార్గెట్ గా కాంగ్రెస్ కు దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని చెరి మూడు లేకపోతే నాలుగో సీట్లకు పోటీచేసి గెలవాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వీళ్ళతో అధికారికంగా చర్చలు జరపలేదు. ఎందుకంటే పార్టీలోనే టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఉన్న 119 సీట్లకు 1220 దరఖాస్తులు వచ్చాయి. దీంతోనే టికెట్ల కోసం ఎంత పోటీ ఉందో అర్ధమైపోతోంది. ఈ దశలో ఆశావహులను ఎలా మ్యానేజ్ చేయాలో, బుజ్జగించాలో అర్ధంకానపుడు ఇక కమ్యూనిస్టులతో ఏమి చర్చలు జరుపుతారు.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం 24 నియోజకవర్గాలకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంటే ఆ నియోజకవర్గాల్లోని 24 మందికి టికెట్లు ఖాయం. మిగిలిన 95 సీట్లలోనే తీవ్రమైన పోటీ ఉంది. దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన ప్రదేశ్ ఎన్నికల కమిటి ఆదివారం ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి కవర్లో ఉంచి సీల్ చేసేసింది. ఈ కవర్ను ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటికి అందించింది.

సోమవారం ఈ కమిటి జిల్లాల అధ్యక్షులతో మాట్లాడి, అభిప్రాయాలను తీసుకుని నియోజకవర్గానికి అభ్యర్ధుల ఎంపికలో 1,2,3 అనే ప్రయారిటి చేస్తుంది. దాన్ని ఏఐసీసీ కమిటికి అప్పగించేస్తుంది. అక్కడ మరోసారి మీటింగ్ జరిగి అభ్యర్ధులను ప్రకటించేస్తారు. ఈ హోలుమొత్తంమీద కమ్యూనిస్టులతో చర్చలు అనే ప్రక్రియనే ఎవరు అనుకోవటంలేదు. పీసీసీ తన పని తాను చేసుకుపోతోంది. దీంతో కమ్యూనిస్టుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కేసీయార్ కొట్టిన దెబ్బలాంటిదే కాంగ్రెస్ కూడా కొడుతుందేమో అనే టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు అదే దెబ్బపడితే వామపక్షాలు ఏమిచేస్తారో చూడాలి.