Begin typing your search above and press return to search.

నారాయణ ఎక్కువగా ఊహించుకుంటున్నారా ?

కలిసివస్తేనే కాంగ్రెస్ తో కూడా పొత్తుంటుందని చెప్పారు. నిజానికి పొత్తులపై కేసీయార్ కాదు పొమ్మన్న తర్వాతే సీపీఐ కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:20 AM GMT
నారాయణ ఎక్కువగా ఊహించుకుంటున్నారా ?
X

పార్టీ బలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లున్నారు. అందుకనే ఎక్కడపడితే అక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతు చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం. ఆయన ఏమన్నారంటే కేసీయార్ ఇచ్చే సీట్లు తమకు వెంట్రుకతో సమానమట. ఆ వెంట్రుకలకోసమే నెలల తరబడి కేసీయార్ చుట్టూ తిరిగిన విషయాన్ని మరచిపోయారు. బీఆర్ఎస్ తో పొత్తు కోసం సీపీఎంతో పాటు సీపీఐ కూడా ఎందుకని తహతహలాడిందో నారాయణ చెబితే బాగుంటుంది.

కలిసివస్తేనే కాంగ్రెస్ తో కూడా పొత్తుంటుందని చెప్పారు. నిజానికి పొత్తులపై కేసీయార్ కాదు పొమ్మన్న తర్వాతే సీపీఐ కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది. తమ బలానికి మించి సీపీఐ ఎక్కువసీట్లు అడుగుతోంది. అందుకనే కాంగ్రెస్ కూడా ఏమీ తేల్చటంలేదు. వాస్తవం మాట్లాడుకుంటే సీపీఐ సొంతంగా పోటీచేసి గెలుచుకునే సీటు ఒక్కటి కూడా లేదు. అయితే ఇక్కడ గమనించాల్సంది ఏమిటంటే సొంతంగా ఒక్కసీటును గెలుచుకోలేకపోయినా ఏదో పార్టీని ఓడించేంత బలమైతే ఉంది.

సీపీఐ బలం చాలా పరిమితంగా మాత్రమే ఉందని అందరికీ తెలుసు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే పార్టీ పరిమితమైపోయింది. ఇంకెక్కడైనా ఉంటే ఒకటి రెండు నియోజకవర్గాకు మాత్రమే పరిమితమైపోయింది. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని నారాయణ మాత్రం రివర్సులో చెబుతున్నారు. బీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో నారాయణ ఏదేదో మాట్లాడేస్తున్నారు. పొత్తు చర్చల్లో సీపీఐకి కాంగ్రెస్ మహాయితే ఎక్కడైనా ఒక అసెంబ్లీ సీటును కేటాయిస్తే ఎక్కువ.

పొత్తులో ఒకసీటును వదులుకుంటున్నందుకు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ లాభపడితే లాభపడచ్చు. ఇంతోటి దానికే సీపీఐ బలాన్ని నారాయణ చాలా ఎక్కువగా ఊహించేసుకుని నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. జమిలిపై కేంద్రప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటి బోతస్ అన్నారు. ఇండియాకూటమి దెబ్బకు ఓటమిభయంతోనే నరేంద్రమోడీ జమిలి ఎన్నికల జపం చేస్తున్నట్లు నారాయణ ఎద్దేవాచేశారు. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లోనే సీపీఐ సత్తా ఏమిటో చివరాఖరుగా తేలిపోతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత సీపీఐ మరి ఇంకెక్కడా నోరెత్తదేమో.