Begin typing your search above and press return to search.

మా వల్లే కాంగ్రెస్ విజయం: సీపీఐ పెద్దాయన జోక్..

ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ లతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 9:44 AM GMT
మా వల్లే కాంగ్రెస్ విజయం: సీపీఐ పెద్దాయన జోక్..
X

మినీ జమిలీగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడా.. ఒక రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. ఇక మిగిలిన మరో రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ గెలుపొందినప్పటి నుంచి.. అంతెందుకు కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేలు వస్తున్నప్పటి నుంచి కొన్ని కొన్ని పార్టీలు కొంత మంది పెద్ద మనుషులు వారికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. కొందరి మాటలను అంతగా పట్టుకోకున్నా.. మరికొందరి వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అథ: పాతాళానికి వెళ్లిన కాంగ్రెస్ రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఊపుమీదకు వచ్చింది. ఇక పొరుగు రాష్ట్రమైన కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కూడా విజయం తథ్యమని సర్వేలు చెప్పాయి. ఇక్కడ మంచి ఊపుమీదకు వచ్చిన బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడంతో ఒక్కసారిగా చతికిలపడింది. ఇది కాస్తా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఆ తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే.

అయితే కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ ను తమ పార్టీ ఖాతాలోకి మార్చుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ రోజు (డిసెంబర్ 18) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా మీట్ లో మాట్లాడారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ లతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. మినీ జెమిలీగా సాగిన ఎన్నికల్లో మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వెళ్తే.. కాంగ్రెస్ గెలిచేదని జోస్యం చెప్పాడు.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ అక్కడ కూడా మార్పు తథ్యం అన్నారు. సీఎం జగన్ బతికుండగానే తన సమాధి తానే కట్టుకున్నారని అన్నారు. ప్రతీ గ్రామంలో సమాధి రాయి వేసుకున్నారన్న ఆయన అధికార మార్పిడిపై మాట్లాడారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన తప్పుల కంటే సీఎం జగన్ చేసిన తప్పులు ఎక్కువ అని ఆరోపించారు.

ఎంపీ స్థానాలపై స్పష్టం

పార్లమెంట్ స్థానల్లో సీపీఐ పోటీ చేసే స్థానాలపై నారాయణ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో ఒక స్థానం నుంచి.. కేరళలో 4, తమిళనాడులో 2, బెంగాల్ లో 3, బస్తర్ లోని ఒక సీటులో పోటీ చేస్తామని చెప్పారు. అన్ని చోట్ల తాము గెలుస్తామని అందుకే సెలక్టెడ్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.