Begin typing your search above and press return to search.

నారా లోకేష్ కి కామ్రేడ్స్ షాక్ ?

తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పోయి పోయి మంగళగిరి సీటుని ఎంచుకున్నారు.

By:  Tupaki Desk   |   13 April 2024 3:26 AM GMT
నారా లోకేష్ కి కామ్రేడ్స్ షాక్ ?
X

తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ పోయి పోయి మంగళగిరి సీటుని ఎంచుకున్నారు. టీడీపీ పెట్టాక కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే గెలిచిన సీటు అది. గడచిన నాలుగు దశాబ్దాలలో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది లేదు. అటువంటి టఫ్ సీటులో పోటీ చేయడం పైగా జగన్ ప్రభంజనం ఆనాడు ఉండడంతో మంత్రి హోదాలోనే లోకేష్ ఓటమి పాలు అయ్యారు.

ఈసారి ఎలాగైనా అక్కడ నుంచి గెలవాలని అనుకుంటున్నారు. అయితే మొత్తం ఓటర్లలో మూడవ వంతు ఉన్న బలమైన చేనేత సామాజిక వర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిని ఎంపిక చేసింది. పైగా ఆమె ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వారసురాలు. దాంతో పాటు మహిళ. ఇక బీసీలు ఎస్సీ బడుగులు ఉన్న సీటు ఇది.

అలాంటి మంగళగిరిలో ఈసారి గెలిచి తీరుతాను అని లోకేష్ అంటున్నారు. ఆయన గెలుపు అంత ఈజీ కాదు అని వైసీపీ అంటోంది. ఇక మంగళగిరి చూస్తే యాభై వేల మెజారిటీ తనకు తధ్యమని లోకేష్ అంటున్నా ఎపుడూ కూడా గెలిచిన ఏ అభ్యర్ధికి కూడా మెజారిటీ 14 వేలకు మించి పెరగలేదు. ఇంకా చెప్పాలంటే లీస్ట్ గా 12 ఓట్లతో 2014లో వైసీపీ గెలిచింది కూడా ఇదే సీటు.

అంటే హోరా హోరీ ఫైటింగ్ ఇక్కడ ఎపుడూ జరుగుతుంది. ఇక మంగళగిరిలో కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకు మొదటి నుంచి బలం ఉంది. ఆ రెండు పార్టీలు అనేక సార్లు గెలిచాయి. ఇక కమ్యూనిస్టులు చూస్తే 2004లో ఒంటరిగా పోటీ చేసి 33 వేల సాధించారు. 2009లో చూస్తే సీపీఎం సీపీఐ విడివిడిగా పోటీ చేసి చెరి పాతిక వేల ఓట్లు తెచ్చుకున్నాయి.

ఇక 2014లో రెండు పార్టీలు మరోసారి విడిగా పోటీ చేస్తే పది వేల ఓట్లు రెండు పార్టీలకు కలిపి వచ్చాయి. ఇక 2019లో సీపీఐ అభ్యర్ధికి 10 వేల ఓట్లు లభించాయి. ఇదంతా ఎందుకు అంటే 2024లో మంగళగిరి నుంచి కామ్రేడ్స్ మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు.

వారికి కనీసంగా పది వేల ఓట్లకు తక్కువ కాకుండా బలం ఉందని గత ఎన్నికలు నిరూపించాయి. ఈసారి కూడా అంతే స్థాయిలో ఓట్లు చీలిస్తే ఎవరి ఓట్లకు గండి పడుతుంది అన్న చర్చకు తెర లేస్తోంది. ప్రజా సమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులకు పడే ఓట్లు అధికార వైసీపీ మీద వ్యతిరేకతతో అయితే కచ్చితనా పడతాయి అని అంటున్నారు.

అంటే అవి టీడీపీ కూటమికి గండి కొట్టే ఓట్లుగానే చూస్తున్నారు. బీజేపీతో పొత్తు లేని సందర్భంలో గడచిన నాలుగేళ్ళూ చంద్రబాబు వెంట అనేక పోరాటాలలో కమ్యూనిస్టులు పాలు పంచుకున్నారు. అలా చూసుకున్నా టీడీపీ కూటమి ఓట్లే చాలా వరకూ టర్న్ అవుతాయని అంటున్నారు.

అదే కనుక జరిగితే కచ్చితంగా నారా లోకేష్ కి అది ఇబ్బందికరం అవుతుంది అని అంటున్నారు. అధికారంలో ఉండే పార్టీకి పడాల్సిన ఓటు ఎపుడూ పడుతుంది పడని ఓటే చీలుతుంది. అలా అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి టీడీపీ కూటమికి పడాల్సిన ఓట్లు ఎర్రన్నల వైపు వస్తే ఓట్ల చీలిక అన్నది వైసీపీకే లాభం అవుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో బలమైన రాజకీయ భూమిక ఉన్న కమ్యూనిస్టుల పోటీ కూటమికే ఎక్కువగా నష్టం అని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.