బాబు మీద వైసీపీ కంటే ఘాటుగా కామ్రేడ్ !
అసలు జర్మనీలో కేఎఫ్ డబ్ల్యూ అన్న సంస్థ ఉన్న సంగతే ఎవరికీ తెలియదని అన్నారు.
By: Tupaki Desk | 7 April 2025 9:04 AM ISTఏపీలో కామ్రేడ్స్ కి బలం లేకపోవచ్చు. సైద్ధాంతిక బలం వారికి ఉంది. వారు అవినీతి అక్రమాలకు వ్యతిరేకం అన్న భావన అయితే గట్టిగా ఉంది. ఇదిలా ఉంటే అయిదేళ్ళ పాటు టీడీపీతోనే కలసి నడచిన సీపీఐ బీజేపీతో జట్టు కట్టిన తర్వాత దూరం అయింది
ఆ మీదట గత పది నెలలలో విమర్శలు చేసినా అవి ఒక మాదిరిగానే ఉండేవి. కానీ ఫస్ట్ టైం వైసీపీ కంటే ఘాటుగా సీపీఐ బాబు మీద విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీలో అప్పులు ఎక్కువ అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మండిపడుతున్నారు.
జగనే నయం ఆయన కంటే మీరే ఎక్కువ అప్పులు తెచ్చారు అని కూడా నిందించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన రెండు రోజులకే ఏకంగా అయిదు వేల కోట్ల అప్పు తెచ్చారని బాబు మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. అమరావతి కోసం ఎక్కడ లేని అప్పులూ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అసలు జర్మనీలో కేఎఫ్ డబ్ల్యూ అన్న సంస్థ ఉన్న సంగతే ఎవరికీ తెలియదని అన్నారు. అలాంటి చోటకు కూడా వెళ్ళి అప్పులు తెచ్చారు అంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. అమరావతి రాజధాని కోసం ఏకంగా 62 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా ఈ అప్పులు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అప్పులు కావు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అని మొదట చెప్పి ఇపుడు అవన్నీ అప్పులుగానే చూపిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. ఏపీలో అప్పుల మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఉన్నట్లుండి సడెన్ గా ఎందుకు కామ్రెడ్ ఈ విధంగా విమర్శలు చేశారు అన్నది చర్చగా ఉంది. కేంద్రంలో బీజేపీ వక్ఫ్ బిల్లుకు టీడీపీ జనసేన కలసి అనుకూలంగా ఓటు చేశాయి. మరో వైపు బీజేపీతో ఈ రెండు పార్టీల బంధం దీర్ఘకాలంలో కొనసాగేలా కనిపిస్తోంది అన్నది కూడా అర్థం అవుతోంది.
దాంతో టీడీపీ మీద ఎర్రన్నలు కన్నెర్ర చేస్తున్నారు అని అంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అయినా దానిని ఒక రూపూ షేపూ తీసుకుని రాకపోతే అక్కడ మిగులు భూములు అమ్ముడు పోవు కదా అని కూటమి నేతలు అంటున్నారు.
దాని కోసం అయినా ఖర్చు చేయాలి కదా అని చెబుతున్నారు. రేపటి రోజుల భూములకు ధరలు వచ్చి మొత్తం అన్ని అప్పులూ తీర్చేస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అవదా అని అంటున్నారు మొత్తానికి జగన్ మేలు ఆయన కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని సీపీఐ అనడంతో పాటు అమరావతి మీద విమర్శలు చేయడంతో కొత్త చర్చ అయితే స్టార్ట్ అయింది.
