Begin typing your search above and press return to search.

పవన్ ని వెంటాడుతున్న కామ్రేడ్ నారాయణ

ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శి. రాజకీయంగా చూస్తే అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం. ఉద్యమం విషయం తీసుకుంటే ఇంకా ఎక్కువే.

By:  Tupaki Desk   |   5 Jun 2025 10:09 AM IST
పవన్ ని వెంటాడుతున్న కామ్రేడ్ నారాయణ
X

ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శి. రాజకీయంగా చూస్తే అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం. ఉద్యమం విషయం తీసుకుంటే ఇంకా ఎక్కువే. ఆయనే నారాయణ. ఆయనకు ప్రత్యర్ధులు చికెన్ నారాయణ అని కూడా అంటారు. అపుడెపుడో గాంధీ జయంతి వేళ తెలియక ఆయన చికెన్ తినడంతో ఆయనకు ఆ ట్యాగ్ తగిలించి మరీ ప్రత్యర్ధులు సంబరపడుతూంటారు.

సీపీఐలో నిబద్ధతతో నారాయణ పనిచేస్తున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కూడా కాలేదు. ప్రజా సమస్యల మీదనే తమ పోరాటం అన్నారు. అదే లక్ష్యంగా చేసుకున్నారు. అంతా బాగానే ఉన్న నారాయణ నోరే ఆయనను ఇబ్బందుల పాలు చేస్తోంది.

ఆయన ఉన్నట్లుండి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. అది చూస్తే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది అని అంటున్నారు. దానికి కారణం పవన్ సనాతన ధర్మాన్ని వెనకేసుకుని మాట్లాడమే. పవన్ సనాతనిగా మారి తన వంతుగా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు.

అది ఆయన ఇష్టం. అంత మాత్రం చేత ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేయడమేంటి అని జనసేన నుంచి చాలా మంది నారాయణ మీద గుస్సా అవుతున్నారు. నారాయణ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఆయన లేటెస్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేసి మరీ పవన్ ని గట్టిగా కెలికారు.

అందులో పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. విడాకులు సనాతన ధర్మంలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ సనాతన ధర్మం ఎలా చెబుతారు అని గద్దిస్తున్నారు. ఆయన సనాతన ధర్మం అంటే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఆయన కేవలం పవన్ తోనే ఊరుకోవడం లేదు. సనాతన ధర్మం అని ఎవరైనా అంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం చాలా క్రూరమైనదిగా ఆయన చెబుతున్నారు. సెక్యులరిజాన్ని సనాతన ధర్మం నాశనం చేస్తుంది అని నారాయణ అంటున్నారు. అందుకే సనాతన ధర్మం అన్నది వద్దే వద్దు అంటున్నారు. అయితే ఈ రోజున పవన్ అన్నారనో మరొకరు అన్నారనో సనాతన ధర్మం పుట్టుకు రాలేదు కదా నారాయణా అని సనాతనవాదులు అంటున్నారు.

ఈ రోజుకీ భారత దేశం లౌకిక భావాలతో ఉందని అంటున్నారు. సనాతన ధర్మం అంటే హిందూ సంస్కృతిని రక్షించుకోవడం అని గుర్తు చేసే వారూ ఉన్నారు. అంత మాత్రం చేత ఇతర మతాలను ఎవరూ తక్కువ చేయడం లేదని మరి నారాయణకు ఎందుకు అంత కోపమని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనడాన్ని నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు అంటే ఆయనకు ఉన్న సినీ గ్లామర్ వల్ల అది మరింతగా జనంలోకి చొచ్చుకుని పోతుందని భయమా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఏది ఏమైనా నారాయణ వంటి సీనియర్ నాయకులు ఇలా మరో రాజకీయ నేత మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సబబేనా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు సనాతన ధర్మం మీద ఊరకే విమర్శలు చేయడం తగదని అంటున్నారు. కానీ నారాయణ వింటారా అన్నదే పెద్ద డౌట్ అంటున్నారు.