అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్న కాంగ్రెస్ మంత్రులు : నారాయణ
రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులంతా అందాల భామల వెనుక "సొల్లు కార్చుకుంటూ" తిరుగుతున్నారని, భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టడం "సొల్లు కార్చుకోవడానికా" అని తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు సీపీఐ నారాయణ.
By: Tupaki Desk | 20 May 2025 3:23 PM ISTరాష్ట్ర కాంగ్రెస్ మంత్రులంతా అందాల భామల వెనుక "సొల్లు కార్చుకుంటూ" తిరుగుతున్నారని, భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టడం "సొల్లు కార్చుకోవడానికా" అని తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు సీపీఐ నారాయణ. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలిసి విలేకరులతో మాట్లాడిన నారాయణ, హైదరాబాద్ నగరం అందాల భామల చుట్టే తిరుగుతోందని వ్యాఖ్యానించారు.
మోడీపై నారాయణ సంచలన ఆరోపణలు:
దేశ ప్రధాని మోడీలా వ్యవహరించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా, మోడీ డీ ఆక్టివ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ డీయాక్టివ్ ప్రధానిగా ఉండటం దురదృష్టకరమని, దేశానికి ప్రధాని మోడీయా లేక ట్రంప్ అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు.
అమెరికా విధానాలు, పన్నులపై విమర్శలు:
తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను విదేశాలకు పంపిస్తే, వారు పంపించే డబ్బుపైనా 5 శాతం పన్ను పేరుతో అమెరికా దోచుకుంటుందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భారతదేశానికి అపార నష్టమని, దీనిని ప్రధాని మోడీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ యుద్ధం ఆపమంటే ఆపుతారని, కానీ అమెరికా ఆడుతున్న దోపిడి పైశాచికత్వాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. యూఎస్‌లోని ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సమ్మె చేస్తే అమెరికన్ ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదంపై రాజకీయాలు:
టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోడీ సొంత రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోడీ మాత్రం ట్రంప్‌కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.
బీజేపీ ఏకపక్ష వైఖరిపై ధ్వజం:
పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు బీజేపీ ఎంపిక చేసిన దౌత్య బృందాలను పార్టీలకు సంబంధం లేకుండా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, కనీసం పార్టీలకు రాజకీయ ప్రజాస్వామ్యం కూడా ఉండొద్దా అని నిలదీశారు. బీజేపీ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ టీఎంసీ ఎంపీలు వెళ్లరని మమతా బెనర్జీ తేల్చి చెప్పారని, కాంగ్రెస్ కూడా అలాగే ప్రకటన చేయాలని కోరారు.
సైనికులపై అనుచిత వ్యాఖ్యలు - కేంద్రం నిర్లక్ష్యం:
దేశ రక్షణ కోసం అన్ని పార్టీలు మోడీకి మద్దతు ఇచ్చాయని, ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాల్సింది పోయి మోడీ సొంత రాజకీయాలు చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనకు రెండు రోజుల ముందే తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని అక్కడ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చెప్పినా, ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియదని ప్రశ్నించారు. సైనికుల మీద బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోలేదని, అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
