Begin typing your search above and press return to search.

ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకా కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

కోవిడ్ టీకాల వల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయనే అనుమానాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వివరణ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   26 July 2025 12:31 PM IST
ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకా కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
X

కోవిడ్ టీకాల వల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయనే అనుమానాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వివరణ ఇచ్చింది. దేశంలో ఆకస్మిక మరణాలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం చేసినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో తెలిపారు. ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకా కారణం కాదని ఆ అధ్యయనంలో తేలిందని చెప్పారు. కరోనాతో ఆస్పత్రి పాలవడం, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర, మరణానికి 48 గంటల ముందు అతిగా మద్యం సేవించడం, మాదక ద్రవ్యాల అలవాటు వల్ల ఆకస్మిక మరణాలు పెరిగినట్లు ఐసీఎంఆర్ పరిశోధనలో వెల్లడైందని కేంద్ర మంత్రి తెలిపారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా ఆకస్మిక మరణం ముప్పు ఉందని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

2023 మే-ఆగస్టు మధ్య దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 ఆస్పత్రుల్లో ఐసీఎంఆర్-జాతీయ అంటు వ్యాధుల పరిశోధన సంస్థ (ఎన్ఐఈ) సంయుక్తంగా ఈ అధ్యయనం చేసినట్లు కేంద్ర మంత్రి నడ్డా వెల్లడించారు. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకుంటే ఆకస్మిక మరణాల ముప్పు తగ్గిందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు నివేదిక అందిందని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు కోవిడ్-19 టీకాల వల్ల 2020-2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మరణాలను నివారించినట్లు మరో అధ్యయనం వెల్లడించింది.

ప్రతి 5400 టీకా డోసులకు ఒకటి చొప్పున మరణాన్ని ఆపగలిగినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం కలిగిందనడానికి ఇది స్పష్టమైన ఆధారమని వివరించింది. ఇటలీలోని క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలాన్, అమెరికాలోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు కోవిడ్-19కు సంబంధించిన ప్రపంచవ్యాప్త మరణాల డేటాను విశ్లేషించారు. ఈ మరణాలు టీకా వేసుకోడానికి ముందు సంబంవించాయా లేక ఆ తర్వాత చోటుచేసుకున్నాయా? అన్నది పరిశీలించారు. దీని ఆధారంగా ఒక నమూనాను రూపొందించి, కోవిడ్ టీకా లేకుంటే ఎన్ని మరణాలు సంభవించి ఉండేవన్నది గణించారు. టీకాల వల్ల ప్రాణాలు కాపాడుకున్నవారిలో 82 శాతం మంది వైరస్ సోకడానికి ముందే వ్యాక్సిన్లు పొందారని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకాల సాయంతో మరణాన్ని తప్పించుకున్నవారిలో 90 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారేనని వివరించారు.