పవన్ కి షాక్...కోర్టు నుంచి సమన్లు
ఇంతకీ ఆ బాంబు లాంటి ఆరోపణ ఏమిటి అంటే ఏపీలో ఏకంగా ముప్పయి వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నది.
By: Tupaki Desk | 23 July 2025 10:01 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలింది. ఆయన అయిదేళ్ళ విపక్ష రాజకీయ జీవితంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇపుడు అధికారంలో ఉన్న ఆయనకు కేసుల రూపంలో చుట్టుముడుతున్నాయని అంటున్నారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వం మీద పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు.
ఈ క్రమంలో ఆయన ఒక అతి పెద్ద ఆరోపణను చేశారు. అదే ఇపుడు కోర్టు సమన్ల రూపంలో పవన్ కి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ అతి పెద్ద ఆరోపణ ఏమిటి అంటే అందరికీ గుర్తు ఉన్నదే. ఒకనాడు ఆ సంచలన ఆరోపణ అందరి మెదళ్ళకూ పదును పెట్టినదే. అవునా నిజమేనా అని అంతా ఒణికిపోయినదే.
ఇంతకీ ఆ బాంబు లాంటి ఆరోపణ ఏమిటి అంటే ఏపీలో ఏకంగా ముప్పయి వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నది. నిజంగా ఇది దేశంలోనే సంచలనం రేకెత్తించిన ఆరోపణగానే అంతా చూశారు. ఒకరిద్దరు కాదు వేలల్లో అమ్మాయిలు మిస్ కావడం అంటే మామూలు విషయం కాదు.
ఆ సీరియస్ విషయాన్ని పవన్ తన వారాహి సభలలో పదే పదే ఆరోపణలుగా సంధించారు. అంతే కాదు ఇన్ని వేల మంది మహిళలు అదృశ్యం కావడం వెనక వాలంటీర్లు ఉన్నారని కూడా మరో తీవ్ర ఆరోపణ చేశారు. వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది.
వారు ప్రతీ ఇంటికీ వెళ్ళి పౌర సేవలు అందించేవారు. అయితే ఆ ముసుగులో వారు అంతా ఆయా ఇళ్ళలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆ విధంగా అమ్మాయిల మిస్సింగ్ వెనక కారణం అవుతున్నారు అన్నది ఈ ఆరోపణల వెనక సారాంశం. అయితే దీని మీద గతంలోనే కేసు ఒకటి దాఖలు అయింది. ఆ కేసుని తరువాత మూసేశారు అని చెబుతున్నారు.
ఇపుడు ఆ కేసుని రీ ఓపెన్ చేయాలని న్యాయవాదిగా ఉన్న జడ శ్రావణ్ కుమార్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన వాలంటీర్ల తరఫున తాజాగా పిటిషన్ దాఖలు చేసారు. దాంతో గుంటూరు కోర్టు పవన్ కళ్యాణ్ కి సమన్లు జారీ చేసింది.
ఒక విధంగా చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కి సమన్లు జారీ కావడం సంచలనం. పైగా షాకింగ్ న్యూస్. మరి పవన్ ఏ సందర్భంలో అలా చెప్పారో ఆయన వద్ద ఆధారాలు ఏమి ఉన్నాయో అన్నది గతంలోనే చర్చ జరిగింది. అయితే దానిని అంత సీరియస్ గా ఎవరూ పట్టించుకోలేదు కానీ వైసీపీ మీద రాజకీయ విమర్శలకు అది బాగానే పనికి వచ్చింది అని చెబుతారు.
ఇపుడు ఇన్నాళ్ళకు జడ శ్రావణ్ కుమార్ తాజాగా పిటిషన్ దాఖలు చేయడం కోర్టు పవన్ కి సమన్లు జారీ చేయడంతో ఏమి జరుగుతుంది అన్నది చర్చగా ముందుకు వస్తోంది. న్యాయవాదిగా జడ శ్రావణ్ కుమార్ మంచి ప్రతిభ చూపిస్తారు అని పేరు. ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్ అయితే ఇపుడు సెన్సేషన్ అవుతోంది. కోర్టు సమన్ల మీద జనసేన అధినాయకత్వం ఏ విధంగా రియాక్టు అవుతుంది అన్నది చూడాల్సి ఉంది.
