Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై 'ఆ ప్ర‌చారం' ఆపండి: కోర్టు ఆర్డ‌ర్‌

తెలంగాణ‌లోని కోడె చెరువును ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆక్ర‌మించుకున్నారంటూ.. ఇటీవ‌ల పెద్ద ఎత్తున వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   18 Jun 2026 4:26 PM IST
ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆ ప్ర‌చారం ఆపండి: కోర్టు ఆర్డ‌ర్‌
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిలుపుద‌ల చేయాలని.. సంబంధిత కంటెట్ స‌హా.. యూఆర్ ఎల్స్‌ను కూడా త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని బెంగ‌ళూరు స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇలాంటి ప్ర‌చారాన్ని స‌హించ‌బోమ‌ని జ‌డ్జి వ్యాఖ్యానించారు. నిజానిజాలు తెలుసుకునేందుకు ప్ర‌భుత్వం విచార‌ణ కు ఆదేశించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఈ లోగా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌న్నారు.

ఏంటి వివాదం..

తెలంగాణ‌లోని కోడె చెరువును ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆక్ర‌మించుకున్నారంటూ.. ఇటీవ‌ల పెద్ద ఎత్తున వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై సోష‌ల్ మీడియాలో అనేక విమ‌ర్శ‌లు.. కామెంట్లు కూడా వ‌చ్చాయి. ముఖ్యంగా ఈ నెల 2న తెలంగాణ‌లో ప‌ర్య‌టించేందుకు, స‌భ పెట్టేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నించి న ద‌రిమిలా.. ఆయ‌న‌ను తెలంగాణ‌కు వ్య‌తిరేకిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇలా చేశార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు కూడా ఎదురు దాడికి దిగాయి.

ఇక‌, నాటి ప్రెస్ మీట్‌లోనే స్పందించిన ప‌వ‌న్‌.. కోడె చెరువును తాను ఆక్ర‌మించుకున్నాన‌ని అనుకుంటే .. నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చ‌ని.. ఆక్ర‌మ‌ణే అయితే.. దానిని తానే స్వ‌యంగా ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ వ్య‌వ‌హారం అప్ప‌టితో అయిపోతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ప్ర‌భుత్వం మౌనంగా పాటించినా.. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ.. మ‌రింత‌గా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌ని జ‌న‌సేన ఆరోపించింది.

ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన త‌ర‌ఫున బెంగ‌ళూరు స్థానిక కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన కోర్టు.. కేసు పూర్వాప‌రాల్లోకి తాము వెళ్ల‌డం లేద‌ని.. ఒక ఉప ముఖ్య‌మంత్రి, ప్రామినెంట్ లీడ‌ర్‌, న‌టుడి విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారానికి మాత్ర‌మే వ్య‌తిరేక‌మ‌ని పేర్కొంటూ.. ఇలాంటి ప్ర‌చారాన్ని త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా, నిరాధారమైన ఆరోపణలతో సాగుతున్న కంటెంట్‌ను నిలిపి వేయాల‌న్నారు.

అక్క‌డికే ఎందుకు?

కాగా.. జ‌న‌సేన పార్టీ నాయ‌కులు.. తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యంపై.. బెంగ‌ళూరులో ఫిర్యాదు చేయ‌డం.. అక్క‌డి కోర్టులో పిటిష‌న్ వేయ‌డం ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇది భూముల కోణంలో కాకుండా.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారం కోణంలోనే కేసు దాఖ‌లు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. సోష‌ల్ మీడియా కేసుల‌ను దేశంలో ఎక్క‌డి కోర్టులో అయినా వేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని గ‌త ఏడాది సుప్రీంకోర్టు పేర్కొన్న విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.