Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు రాలేదని గుండు గీయించుకున్న గులాబీ కౌన్సిలర్

అనుకున్నట్లే ఫలితాలు రావటం.. కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చినట్లుగా.. బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:17 AM GMT
కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు రాలేదని గుండు గీయించుకున్న గులాబీ కౌన్సిలర్
X

ఎన్నికల వేళ కొన్ని సిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలిలా జరుగుతుందా? అనిపించే ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. తమ పార్టీ కంటే ప్రత్యర్థి పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయని అధికార పార్టీ నేత ఒకరు సవాలు విసరటం ఒక ఎత్తు అయితే.. ఒకవేళ తమ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం.. తాను గుండు గీయించుకుంటానని సవాలు విసిరి మరీ.. గుండు చేయించుకున్న వైనం షాకింగ్ గా మారింది.

మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పార్టీల వారీగా వచ్చే ఓట్ల మీద కౌంటింగ్ ముందు ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహించే బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పారు ఆ పార్టీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ గంగాధర్. దీంతో.. వారి మధ్య వాదనలు చోటు చేసుకోవటం.. చివరకు సవాళ్ల వరకు విషయం వెళ్లింది. తాను చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చి.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం తాను గుండు గీయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.

అనుకున్నట్లే ఫలితాలు రావటం.. కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చినట్లుగా.. బీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ప్రాధమికంగా వచ్చిన ఫలితాల్ని చూసినంతనే.. సరిగా క్రాస్ చెక్ చేసుకోని గంగాధర్.. తాను విసిరిన సవాల్ కు తగ్గట్లే గుండు గీయించుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్టు చోటు చేసుకుంది. ఆయన గుండు గీయించుకున్న వైనం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సహజంగా ఎవరైనా సొంత పార్టీకి అనుకూలంగా మాట్లాడి గుండు చేయించుకుంటారు. కానీ.. గంగాధర్ మాత్రం అందుకు భిన్నం.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫైనల్ పంచ్ ఏమంటే.. గంగాధర్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లను సాధించింది. కానీ.. గులాబీ నేతలు తప్పుడు సమాచారంతో ఆయన్ను పక్కదారి పట్టించారు.దీనికితోడు కాంగ్రెస్ నేతల్లో కొందరు సరైన సమాచారం తెలియక పొరపాటు పడ్డారు. మొత్తంగా తన సవాలుకు తగ్గట్లే గుండు చేయించుకున్న ఆయన వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి.. తమ వల్ల పొరపాటు జరిగిందని.. గంగాధర్ అంచనా వేసినట్లే.. కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు.. బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. తమ మాటలతో గుండు చేయించుకోవాల్సి రావటంపై విచారం వ్యక్తం చేసి.. క్షమాపణలు కోరారు. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా మాట మీద నిలబడిన సదరు నేతను మాత్రం నిజంగానే అభినందించాలి.