Begin typing your search above and press return to search.

నివసించడానికి బెంగళూరు బెస్ట్.. కాస్ట్లీయెస్ట్.. విస్తరణ స్టార్ట్!

రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:12 AM GMT
నివసించడానికి బెంగళూరు బెస్ట్.. కాస్ట్లీయెస్ట్.. విస్తరణ స్టార్ట్!
X

రాష్ట్ర రాజధాని బెంగళూరు ప్రపంచం మెచ్చి జనావాసంగా గుర్తింపు దక్కించుకుంది. అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటైన ఈ గార్డెన్ సిటీ మరింత ఉన్నతంగా విస్తరించేందుకు "బ్రాడ్‌ బెంగళూరు" పథకం కింద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన అమెరికా వాణిజ్య - వ్యాపార సంస్థ సమావేశంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బెంగళూరు ప్రాముఖ్యతను సుదీర్ఘంగా వివరించారు.

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో ద్రవ్యోల్బణం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాలపై ప్రాపర్టీ ఫస్ట్ వ్యవస్థాపకుడు భవేష్ కొఠారి స్పందిస్తూ... భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కర్ణాటకలో జీవన వ్యయం 1.29 రెట్లు ఎక్కువని, తద్వారా రాష్ట్రం నివసించడానికి అత్యంత ఖరీదైన ప్రదేశాలలో 4వ స్థానంలో నిలిచిందని తెలిపారు.

మరోపక్క గత బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా తీవ్ర ప్రభావితమైన కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత బియ్యం వంటి హామీ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పెరుగుతున్న నెలవారీ ఖర్చుల నేపథ్యంలో... సాదారణ ప్రజానీకానికి ఈ ఉచితాలు ఊరటనిచ్చాయి. ఇదే సమయంలో నిరుద్యోగ యువతకు రెండేళ్లపాటు భృతిని, మహిళా కుటుంబ పెద్దలకు నెలవారీ భృతిని అందించేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, కర్నాటకలోని కుటుంబాల ప్రధాన ఆందోళనల్లో ఒకటి ఎల్‌.పి.జి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం మరొకటి!

అక్టోబర్ 2022లో ధర రూ. 940కి చేరిన గ్యాస్ సిలిండర్ ధర... మార్చి 2023 నాటికి రూ. 1,105కి చేరుకుంది. దీని ప్రభావం హోటళ్లలోని ఆహార పదార్థాల ధరలపై పడిపోవడంతో ప్రజలకు హోటల్ భోజనం చేదెక్కుతున్న పరిస్థితి నెలకొంది!

ఇదే సమయంలో కోవిడ్ మహమ్మారి తర్వాత బెంగళూరులో చాలా కుటుంబాలు ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నాయి. రోజురోజుకీ హాస్పటల్ బిల్లులు సామాన్యుడికి తలకుమించిన భారంగా పరిణమిల్లుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ కు సంబంధించిన వార్షిక ప్రీమియంల ధర రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరిగిందని తెలుస్తోంది.

ఇక అత్యున్నత నిర్మాణ విలువలతో నగరాన్ని విస్తరించే అంశంపై బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె 70 వేల సలహాలు, సూచనలు ప్రస్తుతం స్వీకరించి, సమీక్షిస్తోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల విస్తరణ తక్షణ చర్యగా గుర్తించారు. అత్యధికుల సూచనల్లో ఈ అంశం ప్రముఖంగా కనిపించిందని నగరాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు

ఇదే విధంగా... స్టార్టప్ కంపెనీల రాజధానిగా బెంగళూరు గుర్తింపు పొందింది. వీటి ఏర్పాటులో బెంగళూరు - ఢిల్లీ మధ్య తొలి నుంచి పోటీ నెలకొన్నప్పటికీ... స్టార్టప్ లను రాష్ట్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తున్న క్రమంలో అనేక మంది నగరానికి కదలి వస్తున్నారు.

దీంతో రెండు దశాబ్దాల కిందట 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నగరం.. ప్రస్తుతం 12 వందల చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించగా.. మరో పదేళ్లలో ఈ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని ప్రజల రాకపోకల కోసం మెట్రోతో పాటు సబర్బన్‌ రైలు మార్గాలను నిర్మిస్తారు.