Begin typing your search above and press return to search.

54 కార్పొరేషన్ల ఛైర్మన్లు ఔట్.. కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చే కాలం

అధికారం చేతులు మారినప్పుడు దానికి సంబంధించిన పలు పరిణామాలు వరుస పెట్టి సాగిపోతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:02 AM GMT
54 కార్పొరేషన్ల ఛైర్మన్లు ఔట్.. కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చే కాలం
X

అధికారం చేతులు మారినప్పుడు దానికి సంబంధించిన పలు పరిణామాలు వరుస పెట్టి సాగిపోతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది. కేసీఆర్ సర్కారు హయాంలో నియమించిన పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు ఊడిపోయాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి.. కాంగ్రెస్ గెలిచినంతనే పలువురునేతలు గౌరవప్రదంగా తమకున్న పదవులకు రాజీనామాలు చేసేసి తప్పుకున్నారు. మరికొందరు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

తాజాగా మొత్తం 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు ఊడబీకేసిన వైనం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎక్కువ మంది రేవంత్ సర్కారు కొలువు తీరినప్పుడు.. తమ పదవులకు కాలం చెల్లినట్లుగా డిసైడ్ అయి ఉన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలుగా పోటీచేసేందుకు టికెట్లు ఇవ్వలేని వారిని.. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయని వారిని.. ఇతర పదవులు ఇవ్వటానికి కుదరని నేతలకు వివిధ సంస్థల కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవిని కట్టబెట్టటం తెలిసిందే. ముఖ్యనేతలకు సన్నిహితంగా ఉండే వారికి ఈ పదవుల పందేరం సాగుతూ ఉంటుంది.

మిగిలిన ప్రభుత్వాలకు కాస్తంత భిన్నం కేసీఆర్ సర్కారు. సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా.. కార్పొరేషన్ల పదవుల్ని ఒక క్రమ పద్దతిలో కేటాయించటం చేస్తుంటారు. కానీ.. కేసీఆర్ సీఎంగా ఉన్న వేళలో మాత్రం ఎవరికి ఎప్పుడు ఎందుకు కట్టబెడతారో తెలీని విధంగా ఛైర్మన్ పదవుల్ని అప్పగించేసేవారు. రెండేళ్ల పదవీ కాలం ఉండే ఈ పోస్టులను భర్తీ చేసే ధోరణి సైతం ఆసక్తికరంగా ఉండేది.

అనూహ్యంగా ఉప ఎన్నికలు ఎదురైనప్పుడు.. కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్ని కట్టబెట్టటం అలవాటుగా ఉండేది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎవరికి ఎప్పుడు పదవులు వచ్చేవో అస్సలు అర్థమయ్యేది కాదు. పదవుల కోసం నేతలు చకోర పక్షుల మాదిరి ఎదురుచూస్తుండేవారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో అయినా.. పరిస్థితుల్లో మార్పులు వస్తాయన్న మాట వినిపిస్తుంది. కేసీఆర్ కు భిన్నంగా రేవంత్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.