కంపెనీ కోసం కష్టపడితే గెంటేశారు.. ఓ టెక్కీ కన్నీటి గాధ..
జాంగ్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడతాం కానీ, మన కోసం పనిచేయం.
By: Tupaki Political Desk | 7 April 2026 2:00 PM ISTకార్పొరేట్ కొలువు అంటే కలల జీవితం.. లక్షల్లో జీతం, విలాసవంతమైన ఆఫీస్, పేరున్న కంపెనీ ట్యాగ్! కానీ, ఆ మెరిసే రంగుల వెనుక ఎంతటి చీకటి ఉందో ఒక టెక్కీ కన్నీటి గాధ వింటే అర్థం అవుతుంది. రాత్రింబవళ్లు కంపెనీ కోసం రక్తాన్ని చెమట చిందించినా, జీవితాన్ని పణంగా పెట్టి పని చేసినా.. చివరకు దక్కిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఒక్క ఇమెయిల్‌తో రోడ్డున పడేయడం! గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఎదురైన ఆ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.
జేసన్ జాంగ్ ఆవేదన
జేసన్ జాంగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గత నెలలో గూగుల్ చేపట్టిన లేఆఫ్స్‌లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి ఫేస్ చేస్తున్న తన నిరుద్యోగ జీవితాన్ని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘నేను ఎప్పుడూ నా పనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. మరింత కష్టపడితే, రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తే, నా వెకేషన్స్ వాయిదా వేసుకుంటే.. నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందని బలంగా నమ్మాను. కానీ, ఇవేవీ నా ఉద్యోగాన్ని కాపాడలేకపోయాయి’ అని జాంగ్ తన తాజా వీడియోలో కన్నీరు మున్నీరయ్యాడు. రాత్రింబవళ్లు వీకెండ్స్ అని తేడా లేకుండా తన జీవితమంతా ఆఫీస్ పనులకే పరిమితమయ్యానని గుర్తుచేసుకున్నాడు.
భ్రమలు వద్దు.. రియాలిటీ ఇదే!
ప్రాణం పెట్టి పనిచేసినా ఉద్యోగం ఉంటుందన్నది భ్రమ మాత్రమేనని జాంగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనతో పాటు పనిచేసిన ఎంతో మంది ప్రతిభావంతులైన ఉద్యోగులు కూడా ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ‘కంపెనీలు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలించుకోగలవు.. కార్పొరేట్ రంగంలో ఇదే ఇప్పుడు కొత్త సాధారణంగా మారిపోయింది’ అని పేర్కొన్నారు. ఈ చేదు అనుభవం తర్వాత, తాను ఏదో ఒకటి సొంతంగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు జాంగ్ తెలిపాడు.
నెటిజన్ల రియాక్షన్..
జాంగ్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడతాం కానీ, మన కోసం పనిచేయం. ముందు మీ ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతివ్వండి. మీరు లేకపోయినా కంపెనీలో పనులు ఆగవు, కానీ మీ జీవితం ఆగిపోతుంది’ అని ఒకరు విలువైన సలహా ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగంతో పాటే ఇతర అవకాశాలు, సైడ్ బిజినెస్ కూడా వెతుక్కోవాలని సూచించారు. 25 ఏళ్లకే తాను కూడా ఇలాగే ఉద్యోగం కోల్పోయి ఏడు నెలలు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. జాంగ్‌కు భవిష్యత్తులో మంచి వాతావరణం ఉన్న ఉద్యోగం దొరకాలని ఆకాంక్షించారు.
కంపెనీలకు మనం నెంబర్ మాత్రమే!
జేసన్ జాంగ్ ఉదంతం కార్పొరేట్ ఉద్యోగులందరికీ కళ్లు తెరిపించే పాఠం. కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు బోనస్‌లు ఇచ్చే యాజమాన్యాలు, కొంచెం ఒడిదుడుకులు ఎదురవ్వగానే ఉద్యోగుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో రుజువైంది. ఒక ఉద్యోగి తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి సంస్థ కోసం ఎంతటి త్యాగానికైనా కట్టుబడతాడు, ఆఖరి నిమిషంలో కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో అతను కేవలం ఒక ఖర్చు (Cost) గా మాత్రమే కనిపిస్తాడనేది ఒప్పుకోలేని వాస్తవం.
నైపుణ్యమే ఆయుధం
ఉద్యోగ భద్రత అనేది నేటి కాలంలో ఒక మిథ్య. అందుకే కేవలం ఒక్క ఉద్యోగంపైనే ఆధారపడకుండా, నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీలు మనల్ని ఎప్పుడైనా తొలగించవచ్చు, కానీ మన నాలెడ్జ్ మాత్రం మనతోనే ఉంటుంది. జేసన్ జాంగ్ లాంటి ఎందరో టెక్కీలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తూ, కార్పొరేట్ బానిసత్వం నుంచి బయటపడి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకుంటున్నారు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి
ఈ ఉదంతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న యువతకు ఇచ్చే అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే.. పని కోసం జీవితాన్ని వదులుకోవద్దు. ఆఫీస్ పనిని ఆఫీస్ గంటలకే పరిమితం చేస్తూ, మిగిలిన సమయాన్ని వ్యక్తిగత ఎదుగుదలకు, కుటుంబానికి కేటాయించడం అవసరం. ‘కంపెనీకి మీరు అవసరం లేకపోవచ్చు, కానీ మీ కుటుంబానికి మీరు ప్రాణం’ అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అప్పుడే ఇలాంటి లేఆఫ్స్ ఎదురైనప్పుడు కుంగిపోకుండా, కొత్త దారిని వెతుక్కునే ధైర్యం లభిస్తుంది.
