Begin typing your search above and press return to search.

కార్పొరేట్ ఆతిథ్యం : సంస్కృతా? కార్పొరేట్ భయమా?

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు దారితీసింది.

By:  Tupaki Desk   |   25 July 2025 9:45 PM IST
కార్పొరేట్ ఆతిథ్యం : సంస్కృతా? కార్పొరేట్ భయమా?
X

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. భారతీయ ఉద్యోగులు తమ విదేశీ క్లయింట్‌ను స్వాగతించేందుకు కార్యాలయ ప్రాంగణంలో డాన్స్‌లు చేస్తున్న ఈ దృశ్యంపై తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక స్వాగత కార్యక్రమమా లేక కార్పొరేట్ సంస్కృతిలో లోపానికి నిదర్శనమా అనే ప్రశ్న తలెత్తుతోంది.

హర్ష గోయెంకా విమర్శల తూటా

ప్రముఖ పారిశ్రామికవేత్త, రెమండ్‌ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. "ఇది సంస్కృతా? లేక కార్పొరేట్ భయమా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు ఆత్మగౌరవానికి తగ్గట్లు లేవని, చనుమొకరితనాన్ని సూచిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపార సంబంధాలలో నిజమైన బంధం నైపుణ్యం, వృత్తి నైపుణ్యంతోనే ఏర్పడుతుందని ఆయన పరోక్షంగా సూచించారు.

-సాంకేతికత & నైపుణ్యమే ముఖ్యం

అంతర్జాతీయ వ్యాపార సంబంధాలలో విజయం సాధించాలంటే నైపుణ్యం, సేవా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకం. డాన్సులు లేదా కేవలం స్వాగత కార్యక్రమాలు తాత్కాలికంగా ఆకర్షణీయంగా అనిపించినా, అవి వ్యాపారానికి దీర్ఘకాలిక విలువను చేకూర్చలేవు. ఒక క్లయింట్‌ను నిజంగా మెప్పించాలంటే వృత్తి నైపుణ్యం, పనితీరు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమయపాలన వంటి అంశాలే ప్రధానం. కేవలం ఆహ్లాదం పంచడం వ్యాపార లక్ష్యం కాకూడదు. డ్యాన్సులతో స్వాగతించడం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు, నిపుణులు "విదేశీయులకు మన సంప్రదాయాలు, జానపద నృత్యాలు ఇష్టంగా ఉంటాయి. ఇది ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ" అని వాదిస్తున్నారు. భారతీయ సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని వారు అభిప్రాయపడుతున్నారు. తమ దేశ సంస్కృతిని పరిచయం చేయడం ద్వారా క్లయింట్‌తో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని వారి ఆలోచన.

-సమస్య అసలు ఏమిటి?

ఈ వివాదం కేవలం డాన్సులపైనో లేదా సంస్కృతిపైనో కాదు. అసలు సమస్య ఉద్దేశం పై ఉంది. ఈ డాన్స్‌లు నిజంగా సాంస్కృతిక ఆతిథ్యంగా, హృదయపూర్వకంగా జరిగాయా? లేక అధికారి భయంతో, కేవలం ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో జరిగాయా? అనే దానిపై వివేచన అవసరం. ఒక ఉద్యోగికి తన ప్రాజెక్ట్ పరిజ్ఞానం, డెడ్‌లైన్‌ను నిబద్ధతతో పూర్తి చేయడమే ప్రాధాన్యత. ఉద్యోగిగా తన పనితీరును ప్రదర్శించాల్సిందే కానీ, వినోదాన్ని పంచే ఎంటర్‌టైనర్‌గా మారకూడదు. ఈ సందర్భంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ సత్య నాదెళ్ల మాటలు గుర్తు చేసుకోవడం సముచితం.. “మీరు క్లయింట్లను ఆకట్టుకోవాలనుకుంటే, దానిని అనుకరణతో కాకుండా ఆవిష్కరణతో చేయండి.” అని గొప్ప మాట చెప్పారు.

భారతీయ సంస్కృతిని ప్రదర్శించడంలో తప్పు లేదు. కానీ అది సంస్థ ఉద్యోగుల నిజమైన నైపుణ్యాన్ని, వృత్తిపరమైన విలువలను మరుగుపరిచే స్థాయికి వెళ్లకూడదు. ఒక సంస్థ తన క్లయింట్లను ఆకట్టుకోవాలంటే, అది కేవలం ఆర్భాటమైన స్వాగత కార్యక్రమాలతో కాకుండా, నైపుణ్యం, విజన్, ఉన్నతమైన సేవల ద్వారా తమ ప్రత్యేకతను చాటుకోవాలి. ఈ సంఘటన మన దేశ కార్పొరేట్ రంగం తమ ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. డాన్సులతో కాదు.. నైపుణ్యంతో మెప్పించడమే నిజమైన గౌరవం గా చెప్పొచ్చు!