తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభాలు.. 'రెడ్ గోల్డ్'పై ఇన్వెస్ట్ చేస్తే కాసుల వర్షమే!
బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్, ఒక భరోసా. కానీ ప్రస్తుత ధరల పెరుగుదల ఆ భరోసాను కాస్త భయపెడుతోంది.
By: Tupaki Desk | 12 Feb 2026 5:00 AM ISTబంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్, ఒక భరోసా. కానీ ప్రస్తుత ధరల పెరుగుదల ఆ భరోసాను కాస్త భయపెడుతోంది. స్టాక్ మార్కెట్ పడినా, భూముల రేట్లు తగ్గినా బంగారం విలువ పడిపోదనేది సామాన్యుల నమ్మకం. కష్టకాలంలో ఆదుకునే "ఆపద్బాంధవుడు"గా గోల్డ్ ను చూస్తారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుల లెక్కలు తలకిందులవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఫిజికల్ గోల్డ్ కొనడం భారంగా మారిందనే ఆలోచనతో మదుపర్లు రూ.100 నుంచి కూడా కొనే వీలున్న డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ వైపు మళ్లుతున్నారు. మరోవైపు బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి వంటి లోహాలను ఎంచుకుంటున్నారు.
వెండి ధరలు కూడా భయపెడుతుండటంతో చిన్నమధుపర్ల దృష్టి ఇప్పుడు రాగిపై పడిందని అంటున్నారు. రాగిని రెడ్ గోల్డ్ అని పిలుస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే లోహాల జాబితాలో రాగి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు పెట్టుబడి అనగానే బంగారం లేదా వెండి గురించే ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారుతుండటంతో పారిశ్రామికంగా రాగికి ఉన్న డిమాండ్ దృష్ట్యా రాగిలో పెట్టుబడిని ఒక లాభదాయకమైన సాధనంగా భావిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) తయారీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగడంతో రాగికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రాగి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలా అని బంగారం మాదిరిగా రాగిని ఇళ్లలో వస్తువుల రూపంలో దాచుకోవడం వల్ల పెద్దగా లాభం ఉండదని చెబుతున్నారు.
రాగిలో పెట్టుబడులు పెట్టాలని భావించేవారు కమోడిటీ మార్కెట్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ద్వారా రాగిని 'ఫ్యూచర్స్' రూపంలో ట్రేడింగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ మనం రాగిని భౌతికంగా తీసుకోకుండా, దాని ధరల హెచ్చుతగ్గుల ద్వారా లాభం పొందవచ్చు అని విశ్లేషిస్తున్నారు. గడిచిన కొన్ని ఏళ్లలో రాగి ధరలు స్థిరమైన వృద్ధిని కనబరిచాయని అంటున్నారు. పారిశ్రామికాభివృద్ధి పెరిగే కొద్దీ దీని విలువ పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిన్న మధుపర్లు గోల్డ్ బదులుగా రెడ్ గోల్డ్ వైపు మళ్లుతున్నారని అంటున్నారు.
