Begin typing your search above and press return to search.

పార్లమెంటులో హీరోయిన్ల పై వివాదం!

హీరోయిన్లను పార్లమెంటుకు ఆహ్వానించడమేంటని పలువురు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 7:19 AM GMT
పార్లమెంటులో హీరోయిన్ల పై వివాదం!
X

భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పలు సంచలనాలకు వేదిక అయిన సంగతి తెలిసిందే. పాత పార్లమెంటు స్థానంలో కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన పాత పార్లమెంటు భవనం ఇక చరిత్రపుటల్లో కలిసిపోయింది. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో సమావేశాలు మొదలయ్యాయి. ఇదొక్కటే ప్రత్యేకత కాదు.. కొత్త పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశాల్లోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లను ఆమోదిస్తూ రెండు సభలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలువురు సినీ తారలను పార్లమెంటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది వివాదానికి దారితీస్తోంది. కేంద్రం ఆహ్వానం మేరకు బాలీవుడ్‌ హీరోయిన్లు.. భూమి ఫడ్నేకర్, షెహనాజ్‌ గిల్‌ తమ తాజా చిత్రం 'థాంక్యూ ఫర్‌ కమింగ్‌', బృందంతో హాజరయ్యారు. అలాగే మరికొంతమంది హీరోయిన్లు.. దివ్య దత్తా, తమన్నా భాటియా, మెహ్రీన్‌ ఫిర్జాదా తదితర భామామణులు కూడా కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఫొటోలకు వీరంతా పోజులిచ్చారు.

ఈ తారామణులను బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వ్యక్తిగతంగా దగ్గర ఉండి చూసుకున్నారు. వారికి మార్గదర్శకంగా వ్యవహరించారు. కొత్త పార్లమెంటు విశేషాలను వారికి వివరించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. హీరోయిన్లను పార్లమెంటుకు ఆహ్వానించడమేంటని పలువురు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు.

బాలీవుడ్‌ లో ఒక వర్గానికి చెందిన హీరోలు, హీరోయిన్ల సినిమాలపైన మోడీ ప్రభుత్వం విషం జిమ్మింది నిజం కాదా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమాల్లో పలు సీన్లను తీసివేయాలని.. లేకపోతే ఆ సినిమాలను అడ్డుకుంటామని బెదిరించడం వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు.

బీజేపీకి అవసరమైతే మాత్రం సినీ నటులను తమ ప్రచారానికి వాడుకుంటోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ, తమకు అవసరమైనప్పుడల్లా దేశంలోని వివిధ భాషలకు చెందిన నటులను బీజేపీ వాడుకుంటోందని గుర్తు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ కోసం పార్లమెంటును ఉపయోగించడంపై ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న పార్లమెంటు ప్రాముఖ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చిల్లర పనులతో దెబ్బతీసిందని మండిపడుతున్నారు.

ఒక ట్విటర్‌ వినియోగదారు ఇలా రాశారు.. ''ప్రజాస్వామ్య దేశానికి పార్లమెంటు బలమైన సంస్థ. ఇలాంటి అర్ధంలేని పనులు దాని విలువను దెబ్బతీస్తాయి. అనురాగ్‌ ఠాకూర్‌... వేరే చోట మీరు ఈ పనులు చేయండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్‌.. 'కేంద్ర మంత్రే హీరోయిన్లకు టూర్‌ గైడ్‌ గా వ్యవహరించడం ఏమిటి' అని ప్రశ్నించారు.