Begin typing your search above and press return to search.

అత్యంత వివాదాస్పద దేశాధినేత.. అత్యంత వివాదాస్పద దేశంలోకి..

జిన్ పింగ్ ఈ మేరకు 'ప్రియ మిత్రుడు' పుతిన్‌కు ఆహ్వానం పంపారు. దీంతో మంగళవారం పుతిన్ బీజింగ్‌ చేరుకున్నారు. బుధవారం జిన్‌ పింగ్‌ తో సమావేశం అవుతారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:20 AM GMT
అత్యంత వివాదాస్పద దేశాధినేత.. అత్యంత వివాదాస్పద దేశంలోకి..
X

ఓవైపు ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. మరోవైపు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు కాలు బయటకు పెడుతున్న సందర్భంలో మరో దేశాధినేత కూడా చాలాకాలం తర్వాత బయటకు వచ్చారు. అది కూడా అత్యంత వివాదాస్పదమైన దేశంలో పర్యటన చేయనున్నారు.

ఏక కాలంలో రెండు యుద్ధాలు అత్యంత అధునాతన టెక్నాలజీ రాజ్యం ఏలుతున్న ప్రస్తుత సమయంలో ప్రపంచంలో ఏక కాలంలో రెండు యుద్ధాలు జరుగుతుండడం గమనార్హం. ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా 20 నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. రష్యాను ఒంటరిని చేసే లక్ష్యంతో అమెరికా-బ్రిటన్ తదితర దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. కానీ, రష్యా అధినేత పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరకు.. అణు బాంబు దాడి బెదిరింపులకూ వెనుకాడలేదు.


ఇరాన్ తర్వాత చైనాకు పుతిన్ అనూహ్యంగా చైనాలో కాలుపెట్టారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకం (బీఆర్ఐ) ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా బీజింగ్‌లో జరిగే అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. చైనా-రష్యా చిరకాల మిత్రులు. అమెరికాకు శత్రువులు. దీంతో బీఆర్ఐ సదస్సుకు రావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కోరగానే పుతిన్ ఒప్పుకొన్నట్లుగా తెలుస్తోంది. జిన్ పింగ్ ఈ మేరకు 'ప్రియ మిత్రుడు' పుతిన్‌కు ఆహ్వానం పంపారు. దీంతో మంగళవారం పుతిన్ బీజింగ్‌ చేరుకున్నారు. బుధవారం జిన్‌ పింగ్‌ తో సమావేశం అవుతారు.

అరెస్టు తప్పదంటూ అప్పట్లో కథనాలు మార్చిలో పుతిన్‌ పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు ఆయన రాలేదు. మరే దేశంలోనూ పర్యటించలేదు. భారత్ లో జరిగిన జి-20 సదస్సుకూ పుతిన్ దూరంగా ఉన్నారు. కాగా, కోర్టు వారెంటు తర్వాత పుతిన్ పర్యటించిన తొలి సోవియటేతర దేశం చైనానే.

ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఆయన అత్యంత అరుదుగా బయటకు వస్తున్నారు. 20 నెలలుగా ఒకప్పటి సోవియట్ రష్యా పాలనలోని దేశాలు, ఇరాన్‌ తప్ప మరే దేశానికీ వెళ్లలేదు. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనగా కిర్గిస్థాన్‌ వెళ్లారు. ఇదీ నాటి సోవియట్ యూనియన్‌ దేశమే.

చైనాకే ఎందుకు?

చైనాతో పాటు దక్షిణాఫ్రికా, భారత్ కూడా బ్రిక్స్ లో భాగమే. కానీ, ఈ రెండు దేశాల్లో జరిగిన సదస్సులకు పుతిన్ వెళ్లలేదు. చైనాలో మాత్రం పర్యటిస్తున్నారు. వాస్తవానికి అరెస్టు వారెంట్‌ ప్రకారం.. ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో పుతిన్ కనిపిస్తే అరెస్టు చేయాలి. ఈ బాధ్యత ఆయా దేశాలపై ఉంటుంది. అందుకే పుతిన్ ఐసీసీ సభ్య దేశాలైన భారత్, దక్షిణాఫ్రికాలకు వెళ్లలేదు. కాగా, ఐసీసీలో కమ్యూనిస్టు చైనా సభ్య దేశంగా లేదు. కాబట్టి పుతిన్ పర్యటనకు అడ్డంకులు లేవు.

కొసమెరుపు: పుతిన్ చైనాలో ఉన్న సమయంలోనే బైడెన్ ఇజ్రాయెల్ వెళ్తున్నారు. మరోవైపు పుతిన్, జిన్ పింగ్ పరోక్షంగా ఇజ్రాయెల్ వ్యతిరేకులే. ఇంకో గమనార్హం అయిన విషయం ఏమంటే.. మూడేళ్లుగా చైనా అత్యంత వివాదాస్పద దేశంగా మారింది. కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాతో నేరుగా మాటల యుద్ధానికి దిగింది. ఉక్రెయిన్ పై దాడి చేస్తూ దాదాపు రెండేళ్లుగా రష్యా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో పుతిన్ చైనా పర్యటన ఎంతైనా ఆసక్తికరం. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చైనా వైఖరిని చాలా దేశాలు తప్పుబడుతున్నాయి. మరిప్పుడు పుతిన్ తో కలిసి జిన్ పింగ్ ఏమైనా చెబుతారేమో చూడాలి.