Begin typing your search above and press return to search.

నా చావు కోసం ఎదురుచూస్తున్నారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 April 2025 3:45 PM IST
నా చావు కోసం ఎదురుచూస్తున్నారు.. జనసేన ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
X

ఏపీలోని అధికార కూటమి మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పిఠాపురం, నెల్లిమర్ల వంటి నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కార్యకర్తలు, గ్రామ స్థాయి నేతల మధ్య గొడవలు జరుగుతుండగా, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను చనిపోవాలని కొందరు కోరుకుంటున్నారని, నేను చనిపోతే వారు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

తాడేపల్లిగూడెంలోని కడకట్ల స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు టీడీపీ నేతలపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తనతోనే ఉన్న కొందరు నాయకులు నేను త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తాయని, అందులో పోటీ చేసి గెలవాలని కొందరు భావిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు త్యాగం చేయడం వల్ల తాను ఎమ్మెల్యే అయ్యానని అంటున్నారని, కానీ తనకు ఎవరి త్యాగం వల్ల ఎమ్మెల్యే సీటు రాలేదని, మూడు పార్టీలు కలిపి మ్యాండేట్ ఇచ్చాయని అన్నారు. తాను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టి, బెదిరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఎవరి దయాదక్షిణ్యాల వల్ల తాను గెలవలేదని ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు తాడేపల్లిగూడెంను మరో పిఠాపురం చేసేస్తానని అంటున్నారని, అలా చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తాను స్థలాలు, పొలాలు పూడ్చలేదని తనకు ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఏ పార్టీ కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదని, శాసనసభ్యుడిగా గౌరవం ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికుండగా చనిపోవాలని కోరుకోవడం దారుణమని వాపోయారు.