Begin typing your search above and press return to search.

పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సుప్రీం.. తేల్చిచెప్పిన చీఫ్ జస్టిస్

బేసిక్‌ స్ట్రక్చర్‌ డాక్ట్రిన్‌ పై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 4:01 PM IST
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సుప్రీం.. తేల్చిచెప్పిన చీఫ్ జస్టిస్
X

భారత ప్రజాస్వామ్య పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏది అత్యున్నతం..?? దేశ పార్లమెంటు, సుప్రీం కోర్టు.. వీటిలో ఏది అత్యున్నతం..? రాజ్యాంగం.. పార్లమెంటు.. వీటిలో ఏది ప్రధానం..? అనేకసార్లు ఇలాంటి చర్చ వచ్చింది. పలు సందర్భాల్లో తీవ్ర సంఘర్షణ కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే దేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్ బీఆర్ గవాయ్. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ గవాయ్... దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలోని మూడు వ్యవస్థలు (శాసన, న్యాయ, కార్యనిర్వాహక) దీనికిందే పనిచేస్తాయని కుండబద్దలు కొట్టారు.

బేసిక్‌ స్ట్రక్చర్‌ డాక్ట్రిన్‌ పై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రాజ్యాంగాన్ని సవరించేందుకు మాత్రమే పార్లమెంట్‌ కు అధికారాలు ఉనాయని... రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం మార్చేందుకు అధికారం లేదని స్పష్టం చేశారు.

భారత ప్రజాస్వామ్యంలో శాసన (పార్లమెట్-అసెంబ్లీ), న్యాయ (కోర్టులు), కార్యనిర్వాహక (అధికార) వ్యవస్థలు ఉండగా.. నాలుగో వ్యవస్థగా మీడియాను పేర్కొంటారు. మొదటి మూడు వ్యవస్థలలో ఏది అత్యున్నతం అనే చర్చ తరచూ వస్తున్న సంగతిని జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటే అత్యున్నతం అని చాలామంది అంటారని.. రాజ్యాంగమే అత్యున్నతం అని, మిగతా మూడు విభాగాలు దానికిందనే పనిచేస్తాయని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కిందనే విధులు నిర్వర్తిస్తున్నామని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం అని.. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉన్నట్లు గుర్తించాలని స్పష్టం చేశారు. జడ్జిలు స్వతంత్రంగా ఆలోచించాలని.. తీర్పుల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? అనేది కాదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.

కాగా, జస్టిస్ గవాయ్... గతంలో బుల్డోజర్ న్యాయంపై గతంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఉండేందుకు ఇల్లు ఉండాలని పేర్కొన్నారు.