ఎంపీలతో ముఖాముఖి.. లోకేష్ టార్గెట్ ఏంటి.. ?
దీనిలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఇప్పటివరకు ఉన్న సమస్యలు గడిచిన 15 మాసాల్లో పరిష్కరించిన అంశాలపై ఎంపీలు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల ఆదేశించారు.
By: Garuda Media | 2 Feb 2026 7:00 AM ISTతెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇకనుంచి ఎంపీలను కూడా పూర్తిస్థాయిలో జవాబుదారీ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఇప్పటివరకు ఉన్న సమస్యలు గడిచిన 15 మాసాల్లో పరిష్కరించిన అంశాలపై ఎంపీలు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల ఆదేశించారు.
ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తున్న అంశాలు తమ నియోజకవర్గాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఏయే అంశాలను ప్రస్తావిస్తున్నారు.. ఎప్పటివరకు పరిష్కరించారు. అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఎంపీలను కోరారు. ఇక నుంచి ఎమ్మెల్యేలతో ఏ విధంగా అయితే ముఖాముఖి నిర్వహిస్తున్నారో.. ఎంపీలతో కూడా అదే విధంగా ముఖాముఖి నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతోం ది. ఈ క్రమంలో నాయకులు ప్రజలతో ఏ విధంగా మమేకమవుతున్నారు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
సమస్యల పరిష్కారంలో కానీ ప్రజలతో ఉండే సమయం కానీ అదేవిధంగా ఇతర అంశాల్లో కూడా ఏ విధంగా వారు ముందుకు సాగుతున్నారు అనేది ఆసక్తిగా గమనించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికలనాటికీ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా అంచనా వేస్తున్న పార్టీ.. ఆ దిశగా నాయకులను నడిపించేందుకు సన్నద్ధమవుతోంది. సాధారణంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య కొన్ని వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి వివాదాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివాదాలను కొనసాగించకూడదన్నది నారా లోకేష్ లక్ష్యం గా నిర్దేశించుకున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో కూడా ముఖాముఖి నిర్వహించి సంస్థాగతంగా వారికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా.. నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీలను కూడా లైన్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.
