Begin typing your search above and press return to search.

ఏమైంది? కానిస్టేబుల్ ట్రైనింగ్ కు అంతమంది డుమ్మా?

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలిరోజు ట్రైనింగ్ కు కేవలం్ 6500 మంది మాత్రమే హాజరయ్యారంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 8:30 AM GMT
ఏమైంది? కానిస్టేబుల్ ట్రైనింగ్ కు అంతమంది డుమ్మా?
X

ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు. అందునా పోలీసు అయితే మరింత ఆనందం. ఇలాంటి భావాలున్న పరిస్థితుల్లో జాబ్ వచ్చి.. ట్రైనింగ్ కోసం హాజరు కావాలన్న ఆదేశాలను లైట్ తీసుకొని.. శిక్షణకు డుమ్మా కొట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ షురూ అయ్యింది. ట్రైనింగ్ కోసం మొత్తం 13,953 మంది ఎంపిక కాగా.. తొలిదశలో 9333 మందికి శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తొలిరోజున ఈ శిక్షణకు హాజరు కావాల్సిన వారిలో 2833 మంది హాజరు కాకపోవటం గమనార్హం. మొత్తం లెక్కను చూస్తే దాదాపు 30 శాతం వరకు హాజరు కాలేదు.

ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం.. అందునా కానిస్టేబుల్ అన్నంతనే ముందుకు వచ్చేస్తారు. అలాంటిది శిక్షణకు దగ్గర దగ్గర 30 శాతం తక్కువ కావటానికి కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలిరోజు ట్రైనింగ్ కు కేవలం్ 6500 మంది మాత్రమే హాజరయ్యారంటున్నారు.

ఎంపికైన వారిలో శిక్షణకు డుమ్మా కొట్టటానికి కారణం.. వారికి ఇప్పటికే ఏదైనా ఉద్యోగం వచ్చేసి.. మంచిగా సెటిల్ అయి ఉండొచ్చని.. ఈకారణంతోనే కానిస్టేబుల్ ట్రైనింగ్ కు గైర్హాజరు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు డుమ్మా కొట్టటానికి కారణం.. ఇటీవల గురుకుల ఉపాధ్యాయులు.. స్టాప్ నర్సుల పోస్టులను దక్కించుకొని ఉంటారని భావిస్తున్నారు ఈ కారణంతోనే వారు ట్రైనింగ్ కు రాలేదని భావిస్తున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా ఒక అంశాన్ని ఎత్తి చూపుతున్నారు. శిక్షణకు హాజరు కాని వారిలో మహిళా కానిస్టేబుళ్లు ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేసుల ఉన్న కారణంగా కొందరు ట్రైనింగ్ కు రాకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో బ్యాక్ లాగ్ పోస్టుల సంఖ్య గణనీయంగా పెరిగే వీలుందని చెబుతున్నారు. ట్రైనింగ్ లో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ.. శిక్షణకు వచ్చే వారు మొదటిరోజునే హాజరవుతారని చెబుతున్నారు. ఏమైనా.. కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసి.. శిక్షణకోసం పిలిచినప్పుడు రాకుండా పోవటం ఆసక్తికరంగా మారింది.