Begin typing your search above and press return to search.

పొత్తుల్లో తెలంగాణ భేష్.. 3 రాష్ట్రాల నేతలకు తలంటు

తెలంగాణలో మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో, సీఎల్పీ నేత భట్టి, సీనియర్ నాయకుల సమన్వయంతో కదిలి అధికారం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 2:45 AM GMT
పొత్తుల్లో తెలంగాణ భేష్.. 3 రాష్ట్రాల నేతలకు తలంటు
X

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. అప్పటికి ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయం చెప్పాయి. కానీ, వాటిని తలకిందులు చేస్తూ బీజేపీ మూడు పెద్ద రాష్ట్రాలను కైవసం చేసుకుంది. ఈశాన్యంలోని మిజోరంపై ఎవరికీ పెద్దగా ఆసక్తిలేదు. అక్కడ దీనికితగ్గట్లే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి రాజస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున అక్కడ కాంగ్రెస్ కు ఎన్నికల్లో గెలవడం కాస్త కష్టమేననే అభిప్రాయం ఉంది. ప్రయత్నిస్తే మాత్రం విజయం దక్కొచ్చన్నది అంచనా. అయితే, మధ్యప్రదేశ్ లో గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఈ సానుభూతి, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ వైఫల్యాలతో కాంగెరస్ గెలుస్తుందని భావించారు. ఛత్తీస్ గఢ్ లో భూపీందర్ సింగ్ బఘేల్ సర్కారు బాగానే పని చేసిందనే పేరుంది. కానీ, వీటిలో ఎక్కడా గెలుపు దక్కలేదు.

తెలంగాణ చిక్కింది..

తెలంగాణలో మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో, సీఎల్పీ నేత భట్టి, సీనియర్ నాయకుల సమన్వయంతో కదిలి అధికారం దక్కించుకుంది. మిగతా మూడు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ బీజేపీతో నేరుగా తలపడిన కాంగ్రెకస్ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొని గెలిచింది. ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అదే చిన్న పార్టీలను కలుపుకొని పోవడం.. వాస్తవానికి తెలంగాణలో ఏడాది కిందట మూడో స్థానంలో ఉంది కాంగ్రెస్‌. కానీ తాజా ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే పని మిగతా మూడు పెద్ద రాష్ట్రాల్లో జరగలేదు.

సీపీఎం చేజారినా.. సీపీఐని నిలుపుకొని

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఎంతో పొత్తు పెట్టుకుని వెళ్దామని భావించినా సాధ్యం కాలేదు. సీట్ల పంపకంలో తేడా రావడంతో సీపీఎం విడిగా పోటీచేసింది. ఇక సీపీఐని మాత్రం తన దారికి తెచ్చుకుంది. ఫలితంగా ఆ పార్టీకి ఈ సారి శాసన సభలో ప్రాతినిధ్యం దక్కింది. మరోవైపు తెలంగాణ జన సమితి (టీజేఎస్) వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాంను గౌరవిస్తూ, ఆయన ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుంచింది. దీంతో నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఈ మంత్రాన్నే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పాటించలేకపోయింది.

తలంటిన రాహుల్..

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ లో పరాజయాలకు పొత్తులు లేకపోవడమూ కారణమని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం గట్టిగా భావించింది. చిన్న పార్టీలతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఉంటే ఓట్లు చీలి ఉండేవి కావని.. బీజేపీ గెలిచేది కాదని అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. చిన్న పార్టీలను ఎందుకు సర్దుబాటు చేసుకోలేదని ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులపై ఆయన మండిపడినట్లు తెలిసింది. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టక తప్పదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాల్లో పరాజయంపై గురువారం వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో లోతుగా సమీక్ష జరిగింది. మధ్యప్రదేశ్‌లో మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్‌ నాథ్‌ నియంతృత్వ పోకడలతో ఓటమి పాలయ్యామని వల్లే ఆక్షేపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తుకు నిరాకరించారని.. ఆ పార్టీ అధ్యక్షుడు అ అఖిలేశ్‌ ను వఖిలేశ్‌ అంటూ హేళన చేశారని ఆరోపించారు. దీంతో సమాజ్ వాదీ మధ్యప్రదేశ్ లో ఒంటరిగా బరిలోకి దిగిందని తెలిపారు. ‘ఈ రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని ఉండాల్సింది. బీజేపీపై పోరులో ప్రతి ఓటూ కీలకమే’ అని రాహుల్‌ స్పష్టం చేశారు. అయితే, బీజేపీకి ఆ రాష్ట్రాల్లో సంస్థాగతంగా బలంగా ఉందని కొందరు సీడబ్ల్యూసీ సభ్యులు పేర్కొన్నారు. దీనికి కౌంటర్ గా.. 2018లో మూడింటిలోనూ కాంగ్రెస్‌ గెలిచిన విషయాన్ని రాహుల్‌ గుర్తుచేశారు.