Begin typing your search above and press return to search.

టార్గెట్ ఉమెన్ ఓట‌ర్స్‌: కాంగ్రెస్ 'పంచ' ప‌థ‌కాలు ప్ర‌క‌ట‌న‌

మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. ప‌లు రాష్ట్రాల్లో ఇదే సెంటిమెంటు తో అధికారంలోకి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   13 March 2024 5:59 PM GMT
టార్గెట్ ఉమెన్ ఓట‌ర్స్‌:  కాంగ్రెస్ పంచ ప‌థ‌కాలు ప్ర‌క‌ట‌న‌
X

మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. ప‌లు రాష్ట్రాల్లో ఇదే సెంటిమెంటు తో అధికారంలోకి వ‌చ్చింది. తెలంగాణ‌లోనూ ఆర్టీసీ బ‌స్సు ఉచిత ప్ర‌యాణం పేరుతో మెజారిటీ మ‌హిళ‌ల అభిమానం పొందింది. ఇప్పుడు ఇదే విధంగా రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మోడీ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ఢీ కొట్టి నిలబ‌డాలంటే.. మ‌హిళ‌ల ద‌న్ను అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆదిశ‌గానే ఎన్నిక‌ల మేనిఫెస్టోను రూపొందించింది.

మొత్తం 5( పంచ‌) కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది. ఇవి కేవ‌లం దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ఉద్దే శించిన ప‌థ‌కాలుగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొత్త రిక్రూట్‌మెంట్ ప్రకారం నియామకాల్లో సగం హక్కు మహిళలకు ఉంటుందని పేర్కొన్నారు. నారీ న్యాయ్ పేరుతో ఖర్గే ఈ హామీలను ప్రకటించారు.

ఇవీ.. ప‌థ‌కాలు..

1) మహాలక్ష్మి: పేదింటి మహిళకు ప్రతి ఏడాది రూ.1 లక్ష ఆర్థిక సాయం. ఈ నగదును ప్రతి ఏటా పేదల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది.

2) ఆది అబది: కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే నియామకాల్లో 50 శాతం మహిళలకు అవకాశం

3) శక్తి కా సమ్మాన్: ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు

4) అధికార్ మైత్రీ: న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్ మైత్రి నియామకం

5) సావిత్రీబాయి పూలే హాస్టల్స్: ఉద్యోగం చేసే మహిళలకు రెట్టింపు హాస్టల్స్... ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ నిర్మాణం