Begin typing your search above and press return to search.

తెలంగాణ దక్కాలంటే జిల్లాల వారీగా కాంగ్రెస్ ఇలా గెలవాలి

తెలంగాణలో ఎన్నికల అంకం ఘాటెక్కుతోంది. మరీ ముఖ్యంగా బుధవారం ఒక్క రోజే 600 పైనా నామినేషన్లు దాఖలయ్యాయి.

By:  Tupaki Desk   |   9 Nov 2023 2:30 PM GMT
తెలంగాణ దక్కాలంటే జిల్లాల వారీగా కాంగ్రెస్ ఇలా గెలవాలి
X

తెలంగాణలో ఎన్నికల అంకం ఘాటెక్కుతోంది. మరీ ముఖ్యంగా బుధవారం ఒక్క రోజే 600 పైనా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మరీ మంచి రోజు కావడంతో.. 9వ తేదీ కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారంతొ నామినేషన్లు కూడా పూర్తయితే.. ఎన్నికలకు అటుఇటుగా 27 రోజుల సమయం ఉంటుంది. ఈ భారీ వ్యవధిలో ప్రచారం హోరెత్తడం ఖాయం. మరోవైపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఈసారి కాస్త భిన్నంగా ఉంది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం సర్వశక్తులూ ఓడుతోంది. తాము చేసిన పనులే గెలిపిస్తాయని చెబుతోంది. తెలంగాణ ఇచ్చి మరీ రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మరింత పట్టుదల కనబరుస్తోంది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే హస్తం కాస్త బలంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పోలింగ్ నాటికి ఏదయినా జరగొచ్చని, కాకలు తీరిన రాజకీయ నాయకుడైన కేసీఆర్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. డిసెంబరు 3వ తేదీన సస్పెన్స్ తేలిపోతుంది.

బీఆర్ఎస్ గెలుపును అడ్డుకొనేనా?

తెలంగాణలో సంస్థాగతంగా బీఆర్ఎస్ గత పదేళ్లలో బలపడింది. 2014కు ముందు బలమే లేని ఖమ్మం వంటి చోట్ల ఇప్పుడు ప్రధాన పార్టీగా ఎదిగింది. అయితే, తెలంగాణ రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో పట్టుంది. అందుకనే.. ఎటుపోయి ఎటు వచ్చినా కాంగ్రెస్ కు 20 శాతం ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతుంటారు. కానీ, ఎన్నికల నాటికి దీంతోపాటు మిగతా ఓట్లనూ బ్యాలెట్ లోకి వెళ్లేలా చూసుకుంటేనే అధికారం దక్కుతుంది. ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, ఖమ్మం నుంచి మెదక్ దాక కాంగ్రెస్ కు స్థానిక నాయకత్వం బలంగా ఉంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీ కావడమే దీనికి కారణం. అందుకనే.. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ చేతిలో దెబ్బతిన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో హస్తం జోరు కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది. కానీ, ఎన్నికల్లో నిఖార్సుగా నిలబడి బీఆర్ఎస్ ను ఎదుర్కొనడంలోనే విజయం దాగి ఉంది.

అధికారానికి మార్గం ఇది..

2016కు ముందు 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాలుగా మారింది. ఇప్పటికీ కొన్ని అంశాల్లో ఉమ్మడి జిల్లాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాగా, రాజకీయంగా పరిశీలించినా.. ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. కొన్ని నియోజకవర్గాలు భౌగోళికంగా రెండు జిల్లాల్లో ఉండడమే దీనికి కారణం. కాగా, ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిస్తే అధికారానికి అవసరమైన సంఖ్య (60)ను చేరుకుంటుందో విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. సరిగ్గా కొలిచి వేసినట్లుగా కనిపిస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ విశ్లేషణ ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ 4 సీట్లు గెలవాలి. నిజామాబాద్ లో 2, కరీంనగర్ లో 7, మెదక్ లో 7, రంగారెడ్డిలో 7, హైదరాబాద్ లో 3, మహబూబ్ నగర్ లో 8, నల్లగొండలో 11, వరంగల్ లో 6, ఖమ్మంలో 8 మొత్తం 63 సీట్లు అవుతాయి. తద్వారా సాధారణ మెజార్టీ మేజిక్ మార్క్ అయిన 60 దాటేస్తుంది.

ఈ అంకెల లంకె వాస్తవమేనా?

పైన చెప్పిన అంకెల ప్రకారం గెలుపు అంచనా వేస్తే.. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్ కు 7 సీట్లు కష్టమే? ఎందుకంటే ఇక్కడనుంచి కేసీఆర్, హరీశ్ వంటి నాయకులు పోటీలో ఉన్నారు. వీరి ప్రభావం మరికొన్ని నియోజకవర్గాలపైనా ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ లోనూ ఏడు సీట్లు రావడం దుర్లభమే. నల్లగొండ, ఖమ్మంలో మాత్రం అవకాశం ఉంది. సరే.. ఈ ఉజ్జాయింపు లెక్కల్లో కాస్త అటుఇటు ఉన్నా.. ఎవరో గెలుస్తారో కాలానికి వదిలేసి.. డిసెంబరు 3 వరకు వేచి చూద్దాం.