Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు!

సభలు, సమావేశాలు, చేరికలు, అభ్యర్థుల ఎంపిక.. ఇలా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:30 PM GMT
కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలైంది. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందున్నారు.

ఇక మిగిలిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కానీ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ జోరు మీదున్నట్లు కనిపిస్తోంది. సభలు, సమావేశాలు, చేరికలు, అభ్యర్థుల ఎంపిక.. ఇలా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ కన్నేసింది. ఆ దిశగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ను ఎండగడుతూనే.. మరోవైపు ఎన్నికల దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నారనే టాక్ ఉంది.

ముఖ్యంగా కీలక నేతల చేరికలతో పార్టీలో తిరిగి జోష్ పెంచేందుకు రేవంత్ ముమ్మర కసరత్తుల్లో మునిగిపోయారు. బీఆర్ఎస్ టికెట్ దక్కక, ఆ పార్టీలో ప్రాధాన్యత లేక మిగిలిపోయిన నేతలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రేవంత్ ముందడుగు వేస్తున్నారనే చెప్పాలి.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్, బీఆర్ఎస్లో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీజేపీ నుంచి యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితర 15 మంది నాయకులు ఈ నెల 17న జరిగే సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.

మరోవైపు చేరికలు లేక, ఉన్న నాయకులు కూడా వెళ్లిపోతుండటంతో బీజేపీ ఢీలా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా పార్టీలోని అగ్ర నాయకులు మధ్య విభేదాలు కూడా నష్టం చేస్తున్నాయనే టాక్ ఉంది. ఈటల రాజేందర్ మాటకు పార్టీలో విలువ లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుదన్నది ప్రశ్నార్థకంగా మారింది.