Begin typing your search above and press return to search.

తెలంగాణలోని కంచుకోటలో కాంగ్రెస్ అగ్ర నేత పోటీ

మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ జిల్లా, ఆ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రుస్ కు పెట్టనికోట.

By:  Tupaki Desk   |   6 March 2024 7:45 AM GMT
తెలంగాణలోని కంచుకోటలో కాంగ్రెస్ అగ్ర నేత పోటీ
X

ఉమ్మడి ఏపీలో అయినా.. తెలంగాణ ఏర్పాటు అనంతరం అయినా ఆ జిల్లా రాజకీయమే ప్రత్యేకం.. రాష్ట్రమంతా ఒకవైపు ఉంటే.. ఆ జిల్లా తీర్పు మరోవైపు ఉండేది. వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల భావజాలానికి అక్కడ చోటుంటుంది. అంతేకాదు.. స్థానికేతర నాయకులు అక్కడినుంచి గెలిచి ఏకంగా కేంద్రంలో అత్యంత కీలక శాఖలను నిర్వర్తించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ జిల్లా, ఆ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రుస్ కు పెట్టనికోట.

ఆమెను పోటీ నుంచి తప్పించి..

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం హాట్ కేక్ కానుంది. ఓ దశలో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగిన ఈ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ మరో అగ్ర నేత రాహుల్ గాంధీ పేరు వినిపిస్తోంది. ఆయన బరిలో దిగడం ఖాయమేనని తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. వాస్తవానికి ఖమ్మం నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి భార్య, రాష్ట్ర మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి తమ్ముడు తదితరులు పోటీకి సిద్ధమయ్యారు. వీరేకాక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అయితే.. ఏకంగా గట్టి ప్రకటనలకే దిగారు. అయితే, రేణుకాకు రాజ్య సభ సభ్యత్వం ఇవ్వడంతో ఆమె బరిలో లేనట్లే. ఇక రాహుల్ గాంధీనే రంగంలోకి దిగుతుండడంతో మరెవరూ నోరెత్తలేరు.

రంగయ్య నాయుడు నుంచి నాదెండ్ల వరకు

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం అత్యంత విభిన్నం. పోటీకి దిగేది ఎవరు అని కాకుండా.. వారి సామర్థ్యాన్ని చూసి ఓటేస్తారు. దివంగత సీఎం జలగం వెంగళరావు ఇక్కడినుంచి గెలిచి కేంద్రంలో హోం శాఖ వంటి అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సోదరుడు కొండలరావు కూడా పలుసార్లు ఎంపీగా నెగ్గారు. ఇక 1991లొ గోదావరి జిల్లాలకు చెందిన పీవీ రంగయ్య నాయుడు ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ఐఏఎస్ అధికారి కూడా. ఇక 1998లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, 1999, 2004లొ రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీలుగా విజయం సాధించారు.

17లో 11 సార్లు కాంగ్రెస్ దే గెలుపు

ఖమ్మం లోక్ సభ కు 17సార్లు ఎన్నికలు జరగ్గా.. 11 సార్లు కాంగ్రెస్ దే గెలుపు. అయితే, 2004లో చివరిసారిగా ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించింది. 2009, 2019లో నామా నాగేశ్వరరావు (టీడీపీ), 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్సీపీ) నెగ్గారు. పదేళ్ల కిందట దాదాపు సొంత బలంతో గెలిచిన పొంగులేటి ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేత. దీంతో రాహుల్ గాంధీ పోటీకి దిగితే విజయం దాదాపు ఖాయమే.