Begin typing your search above and press return to search.

అద్వానీ ఎపిసోడ్ లో మోడీ టార్గెట్..కాంగ్రెస్ కు తెలివి ఇన్నాళ్లకా?

మెరుపుల్లేకుండా మరకల్ని అదే పనిగా అంటించుకునే తీరుకు భిన్నంగా అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన వేళలో మాత్రం రియాక్టు అయ్యిందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   4 Feb 2024 10:30 AM GMT
అద్వానీ ఎపిసోడ్ లో మోడీ టార్గెట్..కాంగ్రెస్ కు తెలివి ఇన్నాళ్లకా?
X

తెలివితేటలకు.. అతి తెలివితేటకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ ను చెబుతుంటారు సీనియర్ రాజకీయ నేతలు. ఈ దేశంలో రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో వారు అనుసరించిన విధానాలు దేశానికి అతికినట్లుగా సరిపోతాయని చెబుతుంటారు. అదే సమయంలో.. తమ రాజకీయ స్వార్థం కోసం దారుణ రీతిలో స్పందించిన తీరు వారి సొంతంగా చెప్పాలి. ఇలా భిన్న రూపాల్ని ఏక సమయంలో ప్రదర్శించే సత్తా ఉన్న కాంగ్రెస్.. గడిచిన కొంతకాలంగా తన టాలెంట్ ను మిస్ అయ్యిందనే చెప్పాలి. మెరుపుల్లేకుండా మరకల్ని అదే పనిగా అంటించుకునే తీరుకు భిన్నంగా అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన వేళలో మాత్రం రియాక్టు అయ్యిందని చెప్పాలి.

అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించటాన్ని స్వాగతించిన కాంగ్రెస్.. మరో కీలక వ్యాఖ్య చేసింది. అద్వానీకి భారతరత్నను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రకటిస్తే.. ఢిల్లీకి చెందిన ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ మరింత ఆసక్తికర వ్యాఖ్య చేవారు. ప్రధాని మోడీకి.. బీజేపీకి అద్వానీ చాలా ఆలస్యంగా గుర్తుకు వచ్చారని.. రానున్న ఎన్నికల్లో తమ ఓట్లు చెల్లాచెదరు కాకుండా కాపాడేందుకు బీజేపీ సర్కారు తన పదవీకాలం చివర్లో అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినట్లుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన అద్వానీకి భారతరత్నను ప్రకటించటాన్ని స్వాగతించారు.

మాస్టర్ మైండ్ మోడీని దెబ్బేసేందుకు తమ వద్ద ఉన్న పాతకాలం అస్త్రశస్త్రాలతో ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించటం లేదన్న విమర్శ.. తాజా వ్యాఖ్యను చూసినప్పుడు ఆ పార్టీ తన తీరు మార్చుకునే దశలో ఉన్నట్లు చెప్పాలి. ఏది ఏమైనా అద్వానీ జీవితం మొత్తం కూడా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి ఉన్నారు. లోక్ సభలో రెండు సీట్లు బలం ఉన్న పార్టీని ఈ రోజున దేశంలో తిరుగులేని పార్టీగా మార్చటమే కాదు.. సమీప భవిష్యత్తులో దాన్ని సవాలు చేసే స్థాయిలో పార్టీలు లేని రీతిలో బీజేపీ బలం పెరిగిందని చెప్పాలి. అయితే.. ఈ మొత్తం క్రెడిట్ అద్వానీకి ఇవ్వలేం కానీ.. ఆయన పడిన కష్టాన్ని తక్కువ చేసి చూడటం కూడా సరికాదు. ఇంత చేసి కూడా ఆయనకు ఎలాంటి కీలక పదవి.. అత్యున్నత పురస్కారం దక్కలేదని బాధ పడే ఆయన అభిమానులకు మోడీ సర్కారు ఎట్టకేలకు తీపికబురను ఇచ్చిందని చెప్పక తప్పదు.