Begin typing your search above and press return to search.

ఉత్తర తెలంగాణపై పట్టు కోసం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఆ దిశగా కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలతో సాగుతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2023 2:30 AM GMT
ఉత్తర తెలంగాణపై పట్టు కోసం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్
X

తెలంగాణ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఆ దిశగా కచ్చితమైన ప్రణాళిక, వ్యూహాలతో సాగుతోంది. రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉత్తర తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించడం కీలకం. ఉత్తర తెలంగాణలో అధికార బీఆర్ఎస్ బలంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ కు మాత్రం గత రెండు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందుకే ముందుగా అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల బస్సు యాత్రలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. ఉత్తర తెలంగాణ నుంచి బస్సు యాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని గతంలోనే కాంగ్రెస్ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే రామప్ప ఆలయం దగ్గర లోరాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రను ప్రారంభించారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ జోరు మీదుంది. ఇక్కడ అగ్రనేతలతో సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీకి జోష్ వచ్చింది. ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని వివిధ సర్వేల్లో తేలినట్లు సమాచారం. కానీ వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతంగా లేదన్నది టాక్. అందుకే ఉత్తర తెలంగాణను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోంది.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ఉత్తర తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఇందులో ఉత్తర తెలంగాణ నుంచి కేవలం శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మాత్రమే విజయాలు సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ ప్రాంతంలో జెండా పాతడం కీలకం. అందుకే గతంలో ఉన్న మైనస్ పాయింట్లను, బలహీనతలను అధిగమించుకుంటు సాగేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా వ్యూహాలు రచించిందనే చెప్పాలి. ముందుగా రాహుల్ గాంధీతో తొలి విడత బస్సు యాత్ర ఈ ప్రాంతంలో నిర్వహించడం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. రామప్ప ఆలయం నుంచి మొదలైన ఈ బస్సు యాత్ర వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గుండా సాగి నిజామాబాద్లో ముగిసింది. మరోవైపు ఈ ప్రాంతంలో ఇప్పటికే చేరికలను కూడా పెద్ద స్థాయిలో ప్రోత్సహిస్తోంది. నిజామాబాద్, వరంగల్లో కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది.