Begin typing your search above and press return to search.

టికెట్ దక్కిందని ప్రచారం.. కానీ ఆ ఇద్దరికీ కాంగ్రెస్ షాక్

రెండో జాబితాలో బోథ్ (ఎస్టీ) స్థానాన్ని వెన్నెల అశోక్, వనపర్తి టికెట్ ను మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డికి కాంగ్రెస్ కేటాయించింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 1:30 PM GMT
టికెట్ దక్కిందని ప్రచారం.. కానీ ఆ ఇద్దరికీ కాంగ్రెస్ షాక్
X

ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డారు. అనుకున్నట్లుగానే పార్టీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో విజయం కోసం ప్రచారం కూడా మొదలెట్టారు. అన్నీ బాగానే సాగుతున్నాయనుకునే సమయంలోనే ఈ ఇద్దరికీ పార్టీ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీకి దూరం చేసింది. వీళ్ల స్థానాల్లో ఇతరులను అభ్యర్థులుగా తాజాగా ఎంపిక చేసింది. టికెట్ ను చేజార్చుకున్న ఆ ఇద్దరు నాయకులే.. వెన్నెల అశోక్, చిన్నారెడ్డి.

రెండో జాబితాలో బోథ్ (ఎస్టీ) స్థానాన్ని వెన్నెల అశోక్, వనపర్తి టికెట్ ను మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డికి కాంగ్రెస్ కేటాయించింది. కానీ పార్టీ నిర్ణయాలపై ఆయా నియోజకవర్గాల్లో అసంత్రుప్తి నెలకొంది. అంతే కాకుండా ఈ నాయకులు గెలుపు రేసులో వెనుకబడుతున్నారని పార్టీ అధిష్ఠానం భావించిందని సమాచారం. మరోవైపు రాష్ట్ర నాయకులు కూడా సీట్ల విషయంపై పునరాలోచించాలని హైకమాండ్ కు లేఖ రాశారు. దీంతో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో మార్పులు చేసింది.

బోథ్ లో ఆడె గజేందర్, వనపర్తిలో తూడి మేఘారెడ్డిలకు కాంగ్రెస్ ఇప్పుడు అవకాశం కల్పించింది. ఈ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను వీళ్లకు అప్పగించింది. పార్టీ నాయకుల్లో అసమ్మతిని గమనించి, సర్వేల నివేదికలనూ పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ ఈ మార్పులు చేసినట్లు సమాచారం. 2019 నుంచి పెద్దమందడి మండలం ఎంపీపీగా మేఘారెడ్డి కొనసాగుతున్నారు. 2023 మార్చిలో బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పొంగులేటి, జూపల్లితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు. మరి కాంగ్రెస్ మార్పులు ఆ పార్టీకి కలిసొస్తాయేమో చూడాలి.