Begin typing your search above and press return to search.

పార్టీ గెలిచిందిగా..? ఆయన గడ్డం తీసెదెన్నడు..?

తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల కంటే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయని చెప్పొచ్చు. ఎందుకంటే నాడు టీడీపీ కూడా రంగంలో ఉంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 11:13 AM GMT
పార్టీ గెలిచిందిగా..? ఆయన గడ్డం తీసెదెన్నడు..?
X

తెలంగాణలో ఇటీవలి ఎన్నికలు హోరాహోరీగా సాగాయనడంలో సందేహం లేదు. ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రాన్ని చుట్టుముట్టారు. ఇటు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు సుడిగాలి ప్రచారం చేశారు. వెరసి ఓ నెల రోజులు అత్యంత సందడి నెలకొంది. ఇక ఫలితాల సంగతి అందరికీ తెలిసిందే.


శపథం నెరవేరింది..

తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల కంటే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయని చెప్పొచ్చు. ఎందుకంటే నాడు టీడీపీ కూడా రంగంలో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా కూడా ఉన్నారు. ఇక టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి నాడు పోటీ చేశాయి. వీటిని ఒంటరిగానే ఎదుర్కొన్నది బీఆర్ఎస్. ఏకంగా 88 స్థానాలు గెలిచి అధికారం నిలబెట్టుకుంది. ఈసారి కాంగ్రెస్ సీపీఐ మాత్రమే పొత్తు పెట్టుకున్నాయి. సీపీఎం ఎంతకూ తెగని బేరంతో సొంతంగా పోటీ చేసి పరాభవం మూటగట్టుకుంది. టీడీపీ అసలు పోటీకే దూరంగా ఉంది. కాగా, గత ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే క్రమంలో ఆయన ఓ శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేవరకు తాను గడ్డం తీయనన్నారు. తీరా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

ఐదేళ్లకు పైగా అలానే..

ఉత్తమ్ 2018 నుంచి గడ్డంతోనే ఉంటున్నారు. ఆ ఏడాది హుజూర్ నగర్ నుంచి గెలిచినా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగి భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రంలో కాగ్రెస్ గెలిచాకనే గడ్డం తీస్తానని ఆయన చేసిన శపథం ఈ ఎన్నికల్లో నెరవేరింది. ఫలితాలు వచ్చి రెండు వారాలు అవుతోంది. కాంగ్రెస్ గెలుస్తున్న సమయంలో.. తాను గడ్డం తీస్తానని ఉత్తమ్ ప్రకటించారు. ఆ తర్వాత మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. మరి గడ్డం తీసేందుకు సమయం ఎప్పుడో? కాగా, 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఫలితాల వెల్లడికి ముందే తిరుమలకు వెళ్లి తలనీలాలు ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ గెలుపుతో ఆయన మంత్రి కూడా అయ్యారు.