Begin typing your search above and press return to search.

దిగ్గజ నేత కుమారుడికి షాక్.. క్రికెట్ దిగ్గజానికి కాంగ్రెస్ టికెట్

మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు పి.జనార్దన్ రెడ్డి. 1978 నుంచి 2007 వరకు పీజేఆర్ అంటే నగరంలో పెద్ద నాయకుడు

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:39 AM GMT
దిగ్గజ నేత కుమారుడికి షాక్.. క్రికెట్ దిగ్గజానికి కాంగ్రెస్ టికెట్
X

హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఆయనో దిగ్గజం. మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఘనత ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైన సమయంలో అసెంబ్లీలో గట్టిగా పోరాడిన చరిత్ర ఆయనది. అయితే, అనూహ్యంగా 60 ఏళ్ల వయసులోపే మరణించారు. ఒకవిధంగా చెప్పాలంటే జీవించి ఉంటే.. ఇప్పుడు తెలంగాణలో ఆయనే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి. లేదా ఇప్పటికే కాంగ్రెస్ ను ఒక్కసారైనా గెలిపించి ఉండేవారు. కానీ, కాలం ఆయనను భౌతికంగా దూరంచేసింది.

తరంగంలా వచ్చి..

మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు పి.జనార్దన్ రెడ్డి. 1978 నుంచి 2007 వరకు పీజేఆర్ అంటే నగరంలో పెద్ద నాయకుడు. కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించేవారు. ఇక 1994లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లలోనే గెలవగా.. ఆ సమయంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయినప్పటికీ 25 మంది ఎమ్మెల్యేలతో పీజేఆర్ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజా సమస్యలపై పోరాడారు. దీంతోనే అసెంబ్లీ టైగర్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. రాజకీయ జీవితం ఉన్నతంగా సాగుతుందనుకున్న దశలో 1999 ఎన్నికల్లో పీజేఆర్ ఓడిపోయారు. 2004లో గెలిచినా.. వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు దక్కలేదు. ఎంత పోరాడినా, ఆయన నాడు ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఈ క్రమంలో 2007 డిసెంబరులో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయారు. పీజేఆర్ స్థానంలో ఆయన కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో గెలిచారు.

ఖైరతాబాద్ అంటే పీజేఆర్..

పీజేఆర్ అంటే ఖైరతాబాద్. ఖైరతాబాద్ అంటే పీజేఆర్. ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ నియోజకవర్గం నుంచి 1978-2007 మధ్య ఆయన పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్రం ఏమంటే పీజేఆర్ చనిపోయిన తర్వాత ఖైరతాబాద్ పలు నియోజకవర్గాలుగా విడిపోయింది. అందులో భాగంగానే ఏర్పడిన జూబ్లీహిల్స్ నుంచి 2009లో విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. కానీ, తెలంగాణ ఏర్పడిన అనంతరం జరిగిన 2014, 2018 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

దిగ్గజ నేత కుమారుడికే టికెట్ కట్

పీజేఆర్ వంటి దిగ్గజ నేత కుమారుడైన విష్ణుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులుగా టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను బరిలో నిలిపింది. ఇది అనూహ్య పరిణామమే. దీనిని జీర్ణించుకోవడం పీజేఆర్ అభిమానులు, విష్ణు అనుచరవర్గానికి కష్టమే. కాగా, అజహరుద్దీన్ భారత క్రికెట్ దిగ్గజం. అత్యధిక కాలం జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. అంతేకాక, అత్యధిక విజయాలు అందించిన సారథి కూడా ఆయనే. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో అజహర్ క్రీడా జీవితమే మసకబారింది. 333 వన్డేలు, 99 టెస్టులు ఆడిన ఆయన బీసీసీఐ విధించిన నిషేధం కారణంగా మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు.

కొసమెరుపు: మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న పీజేఆర్ కుమారుడు విష్ణుకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వని కాంగ్రెస్.. రెండేళ్ల కిందట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఇచ్చింది. అదికూడా గతంలో తండ్రి, తమ్ముడు ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ కావడం గమనార్హం.