Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ డిక్లరేషన్లతో టెన్షన్ పెరిగిపోతోందా ?

అప్పుడు కేసీయార్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారా ? 2018 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేస్తానన్నారు

By:  Tupaki Desk   |   29 Aug 2023 9:42 AM GMT
కాంగ్రెస్ డిక్లరేషన్లతో టెన్షన్ పెరిగిపోతోందా ?
X

కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ తప్పుడు డిక్లరేషన్లే అని మంత్రి హరీష్ రావు అనటం విచిత్రంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే విషయాన్నే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల రూపంలో చెబుతోంది. డిక్లరేషన్లను నమ్మితే జనాలు కాంగ్రెస్ కు ఓట్లేస్తారు లేకపోతే లేదంతే. ఇందులో హరీష్ ఉలిక్కిపడాల్సిందేమీ లేదు. సరే కాంగ్రెస్ డిక్లరేషన్లు తప్పుడు డిక్లరేషన్లంటున్నారు బాగానే ఉంది. మరి కేసీయార్ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నిజమైనవేనా ?

అప్పుడు కేసీయార్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారా ? 2018 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేస్తానన్నారు. ప్రతి ఏడాది కొంతమొత్తం చొప్పున మాఫీ చేస్తానని అసెంబ్లీలోనే ప్రకటించారు. మరి ప్రకటించినట్లే నెరవేర్చారా ? రాబోయే ఎన్నికల్లో రైతులు ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లేస్తారో ఓడగొడతారో అన్న భయంతోనే ఇపుడు సడెన్ గా రైతు రుణమాఫీ డ్రామాలు మొదలుపెట్టారు. అదికూడా రు. 99,999 లోపు రుణాలున్న రైతులకే. మరి రు. లక్ష దాటి రుణాలన్న రైతుల మాటేమిటి ?

దళితబంధన్నారు, బీసీ బంధన్నారు, మైనారిటిలకు ఆర్ధికసాయమన్నారు. అవన్నీ చేసేశారా ? ఎందుకని ఒక్క హామీని కూడా కేసీయార్ సంపూర్ణంగా అమలుచేయటంలేదు. అధికారంలోకి రాగానే ఎస్సీలకు తలా 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది ? గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఏమయ్యాయి ? లక్షలాది ఉద్యోగాల భర్తీ ఏమైంది ? ఇలా చెప్పుకుంటూ పోతే కేసీయార్ ఇచ్చిన హామీల్లోని డొల్లతనం బయటపడుతుంది.

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా 2018లో జనాలు మళ్ళీ కేసీయార్ నే ఎన్నుకున్నారు. 2018లో ఇచ్చిన హామీలను అమలుచేయకపోయినా రాబోయే ఎన్నికల్లో తిరిగి ఎన్నుకుంటారా లేదా అన్నది తేలుతుంది. కాంగ్రెస్ డిక్లరేషన్లు తప్పుడివి అని చెప్పేముందు మేనమామ, సీఎం కేసీయార్ ఇచ్చిన హామీల అమలు గురించి హరీష్ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. కేసీయార్ ఇచ్చిన హామీలైనా, కాంగ్రెస్ డిక్లరేషన్లు అయినా జనాలు నమ్మితేనే లేకపోతే ఏమీ ఉండదు. కాంగ్రెస్ డిక్లరేషన్లు తప్పుడివని జనాలు అనుకోవాలి అలా కాకుండా నమ్మితే ?