బీసీల సీట్లు తేలిపోతాయా ?
అందుకనే బీసీలకు కేటాయించబోయే నియోజకవర్గాల జాబితాను వెంటనే పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నుండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమాచారం అందినట్లు తెలిసింది
By: Tupaki Desk | 13 Sep 2023 6:07 AM GMTరాబోయే తెలంగాణా ఎన్నికల్లో బీసీలకు అగ్రస్ధానం కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా తీర్మానించుకున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో సామాజికవర్గాల సమీకరణలు చాలా కీలకమని గుర్తించింది. ఇందులో భాగంగానే సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు పెద్దపీట వేయకపోతే ఎన్నికల్లో గెలుపుకష్టమని నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకనే బీసీలకు కేటాయించబోయే నియోజకవర్గాల జాబితాను వెంటనే పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నుండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమాచారం అందినట్లు తెలిసింది
అభ్యర్ధులు ఎవరు అన్నది కాకుండా ముందు నియోజకవర్గాలు ఏవి, ఎన్ని ? అన్నది చాలా కీలకమని అనుకుంటున్నది. ఒకపుడు పార్టీలోని బీసీ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల కృష్ణయ్య లాంటి సీనియర్లు సమావేశమై కనీసం 45 నియోజకవర్గాలు కేటాయించాలని తీర్మానం చేసి అధిష్టానికి పంపారు. అయితే ఆ సంఖ్య క్రమంగా పెరుగుతు ఇప్పటికి 60 నియోజకవర్గాలకు చేరుకుంది. అయితే పార్టీలోని బీసీ నేతల డిమాండ్లు, తీర్మానాలతో సంబంధంలేకుండానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీలను బీసీలకు కేటాయించాలని అనుకున్నది.
దీని ప్రకారమైతే 17 పార్లమెంటు నియోజకర్గాల్లో 34 అసెంబ్లీలు బీసీలకు గ్యారెంటీగా వస్తుందని అనుకుంటున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రకటించిన అభ్యర్ధుల్లో బీసీల సంఖ్య జనాభా దామాషాకు సరిపడా దక్కలేదు. దాంతో బీసీల్లో కేసీయార్ పై తీవ్ర అసంతృప్తి మొదలైంది. పైగా బీసీల్లో చాలా ఉపకులాలుండగా కేసీయార్ మాత్రం ఎక్కువగా యాదవులు, గౌడ్లు, మున్నూరుకాపులకే పెద్దపీట వేసినట్లు గుర్రుగా ఉన్నారు.
అందుకనే ఈ విషయాలన్నింటినీ కాంగ్రెస్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. బీసీల్లోని ఉపకులాల జనాభా ఆధారంగా టికెట్లు కేటాయించే విషయాన్ని ఆలోచిస్తున్నది. ఈ నేపధ్యంలోనే బీసీలకు కేటాయించబోయే నియోజకవర్గాల జాబితాను పంపించమని అధిష్టానం నుండి సమాచారం అందింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 119 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 35-40 నియోజకవర్గాలు బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయట. బీసీలకు కేటాయించాలని అనుకున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇతర సామాజికవర్గాల బలమైన నేతలుంటే అప్పుడు ప్రత్యామ్నాయాలను చూడాలని పార్టీ ఆలోచిస్తోంది. మరి బీసీలకు సీట్లను ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.