Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డికి ఇది అల‌వాటే క‌దా!

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే పార్టీల్లో చేరిక‌ల సంద‌డి ఉండ‌డం మామూలే

By:  Tupaki Desk   |   4 Aug 2023 7:47 AM GMT
జ‌గ్గారెడ్డికి ఇది అల‌వాటే క‌దా!
X

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే పార్టీల్లో చేరిక‌ల సంద‌డి ఉండ‌డం మామూలే. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీలు చేరిక‌ల‌పై దృష్టి సారించాయి. దీంతో వివిధ పార్టీల‌కు చెందిన ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లిసినా.. పార్టీ మార‌తార‌నే ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. అయినా ఇలా పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం ఆయ‌న విష‌యంలో కొత్తేమీ కాదు.

తెలంగాణ‌లో అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. స‌మావేశాల తొలి రోజు బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్‌ను జ‌గ్గారెడ్డి క‌లిశారు. దీంతో వీళ్ల స‌మావేశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ‌ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై మొద‌టి నుంచి జ‌గ్గారెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడి, ఇత‌ర విభాగాల ప‌నితీరును ఆయ‌న విమ‌ర్శిస్తూనే ఉన్నారు. మ‌ధ్య‌లో పార్టీ మారే ఆలోచ‌న కూడా ఉంద‌ని చెప్పారు. కానీ ఆ త‌ర్వాత నిర్ణ‌యాన్ని విర‌మించుకుని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని క‌లిసి పార్టీలోనే కొన‌సాగుతున్నారు.

ప్ర‌స్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న జ‌గ్గారెడ్డి అవ‌కాశం దొరికితే ఏ క్ష‌ణ‌మైనా పార్టీ మారే ఛాన్స్ ఉంద‌నే అభిప్రాయాలు మాత్రం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేటీఆర్‌ను ఆయ‌న క‌ల‌వ‌డంతో క‌చ్చితంగా ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కానీ జ‌గ్గారెడ్డి మాత్రం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మాత్ర‌మే కేటీఆర్‌ను క‌లిశాన‌ని చెబుతున్నారు. ఆయ‌న గ‌తంలోనూ ఇలా బీఆర్ఎస్ నేత‌ల‌ను క‌లిసి.. ఏదో మార్పు జ‌ర‌గ‌బోతుంద‌నే అంచ‌నాలు పెంచేసే.. చివ‌ర‌కు అలాంటిదేమీ లేద‌ని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.