Begin typing your search above and press return to search.

వైఎస్సార్ మావాడు : కాంగ్రెస్ రుణపడిపోయిందా...!?

వైఎస్సార్ మావాడు అని ఈ రోజున మళ్లీ కాంగ్రెస్ పెద్దలు బోర విడుచుకుని మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వారి గొంతు పెద్దది అవుతోని.

By:  Tupaki Desk   |   4 Jan 2024 3:38 PM GMT
వైఎస్సార్ మావాడు :  కాంగ్రెస్ రుణపడిపోయిందా...!?
X

వైఎస్సార్ మావాడు అని ఈ రోజున మళ్లీ కాంగ్రెస్ పెద్దలు బోర విడుచుకుని మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వారి గొంతు పెద్దది అవుతోని. వైఎస్సార్ బొమ్మను వాడుకుంటాం ఆయన నూరు శాతం కాంగ్రెస్ నాయకుడు అని కూడా చెప్పుకొస్తున్నారు.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కి మధ్య ఉన్న బంధం ఎంత, ఎవరు ఎవరికి రుణపడ్డారు. ఎవరు ఎవరి రుణం తీర్చుకోవాలి అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. వైఎస్సార్ 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అంతకు ముందు ఆవు దూడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచి ఆ తరువాత హస్తం కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు యువ మంత్రిగా కాంగ్రెస్ లో అవకాశాలు వచ్చాయి.

దానికి ఆయన నాయకత్వ పటిమ కూడా కారణం అంటారు. కేవలం ముప్పయి అయిదేళ్ల వయసులో వైఎస్సార్ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులు అయ్యారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ వట వృక్షం కూలిపోతే ధైర్యం చేసి పోరాడేందుకు ముందుకు వచ్చిన నాయకుడు వైఎస్సార్. ఆయన అసెంబ్లీ లోపలా బయటా కాంగ్రెస్ తరఫున పోరాటం చేసి ఎన్టీయార్ ని ధీటుగా ఎదుర్కొన్నారు.

ఆయన చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన వ్యతిరేకతతో 1989లో కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఓడింది. అయితే పద్ధతి ప్రకారం 1989లోనే వైఎస్సార్ సీఎం కావాల్సి ఉంది. కానీ ఆయన కాలేదు, ఎంపీగా ఢిల్లీకి రప్పించారు. 1989 1994 మధ్యలో ముగ్గురు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ మార్చినా వైఎస్సార్ కి చాన్స్ ఇవ్వలేదు. పోనీ అలాగని కేంద్ర మంత్రిగా కూడా చాన్స్ ఇవ్వలేదు.

ఇక 1994 నుంచి మళ్ళీ టీడీపీ జమానా మొదలైంది. అపుడు మళ్ళీ వైఎస్సార్ గుర్తుకు వచ్చారు. ఆయనని తెచ్చి 1998 ప్రాంతంలో పీసీసీ చీఫ్ చేస్తే 1999 నాటికి కాంగ్రెస్ ని దాదాపుగా తొంబైకి పైగా సీట్లను సాధించి గెలుపు దిశగా నడిపించారు. ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని సింపుల్ మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.

ఇక 2004లో ప్రాణాలకు తెగించి మే నెల మండుటెండలలో వైఎస్సార్ చేసిన భారీ పాదయాత్ర కాంగ్రెస్ కి కొత్త ఊపిరులు పోసింది. అలా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో గెలవడమే కాదు, కేంద్రంలో పదేళ్ళ తరువాత యూపీయే రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం అయింది.

భారీ ఎత్తున ఎంపీలను గెలిపించి కేంద్రంలో ప్రభుత్వానికి వైఎస్సార్ కారణం అయ్యారు. ఈ మాటలు నాటి కాంగ్రెస్ పెద్దలూ ఓపెన్ గానే అంగీకరించారు. అలా దానికి ప్రతిగా వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. సరే రెండవసారి కూడా ఆయన కాంగ్రెస్ ని గెలిపించి సీఎం సీటుని పదిలం చేసుకున్నారు.

అయితే ఇదంతా ఎందుకు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ మూడున్నర పదుల ఏళ్ళ పాటు సేవ చేస్తే ఆయనకు సీఎం సీటు కాంగ్రెస్ ఇచ్చింది. అది ఉదారంగా కాదని అంటున్నారు. ఇక వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ మీద కేసులు పెట్టించి సీబీఐని ఎగదోసి పదహారు నెలల పాటు జైలులో ఉంచిది కాంగ్రెస్ పెద్దలే అని అంటారు.

అంతే కాదు మరణించిన వైఎస్సార్ పేరుని సైతం ఎఫ్ఐఆర్ లో పెట్టారు అని అంటారు. అలా వైఎస్సార్ రెండవసారి తెచ్చిన అధికారాన్ని అయిదేళ్ల పాటు అనుభవించిన కాంగ్రెస్ వైఎస్సార్ కుటుంబీకులను మాత్రం ముప్పతిప్పలు పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాలకు విసిగి 1994లో టైం లోనే సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని ఆలోచన చేశారని వార్తలు వచ్చాయి.

అంటే కాంగ్రెస్ కి ఆయన చేసిన సేవ కంటే ఆ పార్టీ ఆయనకు ఇచ్చినది ఎక్కువ కాదనే అంటారు. అలా చూసుకుంటే కాంగ్రెస్ వైఎస్సార్ కి రుణపడి ఉండాలని అంటున్నారు. వైఎస్సార్ తయన షర్మిల సైతం తన అన్నను కాంగ్రెస్ జైలులో పెట్టించింది అని ఎన్నో విమర్శలు చేసారు. తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టారని కూడా నిందించిన సందర్భాలు ఉన్నాయని అంటారు.

ఇపుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి పొగుడుతున్నారు. ఏపీలో ఎవరు కాదన్న ధీటైన ప్రజా నాయకుడు వైఎస్సార్. ఆయన వల్లనే కాంగ్రెస్ గట్టి పునాదులు ఏర్పడ్డాయని చెప్పకతప్పదు. ఇపుడు కాంగ్రెస్ కి వైఎస్సార్ మీద ప్రేమ ఉందా అంటే రాజకీయ పరిభాషలోనే జవాబు వెతకాల్సి ఉంటుంది. వైఎస్సార్ కుమార్తె అన్న కారణంతోనే షర్మిలకు కాంగ్రెస్ ఈ ప్రయారిటీ ఇస్తోంది. ఆమె ఇలా పార్టీలో చేరగానే అలా పదవులు అంటున్నారు. రేపటి రోజున కాంగ్రెస్ కి ఏమైనా అవకాశాలు వస్తే అపుడు షర్మిలకు ఏ రకంగా చాన్స్ ఇస్తారో అన్నది కూడా చూడాలని ఆయన అభిమానులు అంటున్నారు.

వైఎస్సార్ పేరు చెప్పుకుని ఏపీలో కాంగ్రెస్ ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్న వేళ ఆయన కలలు కన్న సమైక్య రాష్ట్రాన్ని ఉంచిందా లేదా అన్నది జనాల నుంచి ప్రశ్నగా వస్తుంది. అలాగే ప్రత్యేక హోదా మీద ఎందుకు చట్టం చేయలేదు అన్నది చర్చకు వస్తాయి. వైఎస్ ఆశయం సమైక్య రాష్ట్రం, నెటిజన్లు ఇదే మాట అంటున్నారు. షర్మిల అన్నట్లుగా రాహుల్ ని ప్రధాని చేయడం కాదని సగటు ప్రజనీకం అంటున్నారు.