Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లోకి బీజేపీ కీలక నేతలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుంది

By:  Tupaki Desk   |   25 Oct 2023 6:13 AM GMT
కాంగ్రెస్‌ లోకి బీజేపీ కీలక నేతలు!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అధికారం కోసం పోటీపడుతుండగా బీజేపీ ఇంకా బాలారిష్టాలతోనే ఉంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో కీలక నేతలు.. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌ లకు సీట్లు దక్కలేదు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కీలక నేతలను ప్రకటించకపోవడమేంటనే చర్చ నడిచింది.

ముఖ్యంగా 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచి ఆ తర్వాత బీజేపీలో చేరారు.. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో రాజగోపాలరెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారని టాక్‌ నడుస్తోంది. తాజా ఎన్నికలకు ఆయన తన భార్యకు మునుగోడు సీటును, తనకు ఎల్బీ నగర్‌ సీటును ఆశించారని సమాచారం.

అయితే బీజేపీ అధిష్టానం అటు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కానీ, ఆయన భార్యకు కానీ సీట్లు ప్రకటించలేదు. 2009లో కాంగ్రెస్‌ తరఫున భువనగిరి ఎంపీగా విజయం సాధించిన రాజగోపాలరెడ్డి 2014లో ఓటమిపాలయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక మాజీ కేంద్ర మంత్రి వెంకట స్వామి కుమారుడు, మాజీ ఎంపీ వివేక్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 2009లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలుపొందిన వివేక్‌ 2014లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారని అంటున్నారు. అయితే బీజేపీ అధిష్టానం తొలి విడతలో కీలక నేతగా ఉన్న వివేక్‌ కు సీటు ఇవ్వకుండా షాకిచ్చింది.

దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే రాజగోపాలరెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారని తెలుస్తోంది. వారంతా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అని చెప్పినట్టు సమాచారం. దీంతో రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ లో చేరడం ఖాయమేనంటున్నారు. ఇక వివేక్‌ కూడా ఇదే బాటలో ఉన్నారని చెబుతున్నారు.

కేవలం వీరిద్దరే కాకుండా ఉత్తర తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ ఒకరు, అలాగే మాజీ మహిళా మంత్రి ఒకరు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వీరు గతంలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరినవారే. ఈ నేపథ్యంలో మళ్లీ తమ మాతృ పార్టీ కాంగ్రెస్‌ లో చేరికకు సిద్ధమవుతున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ కూడా వ్యూహాత్మకంగా తొలి విడత జాబితాను మాత్రమే విడుదల చేసింది. బీజేపీ నుంచి వచ్చే నేతలకు చోటు ఇవ్వాలనే రెండో జాబితాను ప్రకటించలేదని అంటున్నారు.