Begin typing your search above and press return to search.

కర్ణాటకలో పెట్టెల కొద్దీ దొరికిన క్యాష్.. తెలంగాణ కోసమా?

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో లభించిన భారీ నగదు సంచలనంగా మారింది

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:10 AM GMT
కర్ణాటకలో పెట్టెల కొద్దీ దొరికిన క్యాష్.. తెలంగాణ కోసమా?
X

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో లభించిన భారీ నగదు సంచలనంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.42 కోట్ల భారీ మొత్తాన్ని అధికారులు గుర్తించి.. సీజ్ చేయటం తెలిసిందే. ఈ ఉదంతంపై స్పందించారు గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ కమ్ మంత్రి హరీశ్ రావు.

కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి బిజినెస్ చేసే వారి నుంచి భారీ ఎత్తున కలెక్షన్లు చేస్తున్నట్లుగా ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి బంగారం.. బిజినెస్ చేసే వారి నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపించారు. ఈ భారీ మొత్తాన్ని తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఖర్చు చేయాలన్న ప్లానింగ్ జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వీలుగా బెంగళూరులోని ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో సిద్ధం చేసినట్లుగా సీరియస్ ఆరోపణలు చేశారు. కర్నాటకలో అంతకు ముందున్న బీజేపీ ప్రభుత్వం.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో 40 శాతం తీసుకునే వారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 40 శాతాన్ని 50 శాతంగా మార్చిందని పేర్కొన్నారు.

ఈ ధనాన్ని బెంగళూరు నుంచి చెన్నైకు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించాలన్నదే ప్లాన్ గా చెప్పుకొచ్చారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ భారీ మొత్తాల్ని పంపిణీ చేయాలన్నదే ప్లానింగ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు హరీశ్. బీజేపీ నాయకులు 40 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించిన అంబికా పతి ఇంట్లోనే ఇంత భారీగా డబ్బులు దొరకటాన్ని హరీశ్ ప్రశ్నించారు.

కర్ణాటకలో జరిగే ప్రతి నిర్మాణంలోనూ.. ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి 75 రూపాయిల చొప్పున కాంగ్రెస్ పార్టీ పన్నుగా వసూలు చేస్తున్నట్లుగా హరీశ్ ఆరోపించారు. కర్ణాటక మొత్తం అవినీతిమయమైనట్లుగా మండిపడ్డ మంత్రి.. అక్కడి వసూళ్లను తెలంగాణలో ఖర్చు చేసి.. అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ ఆలోచనగా చెప్పుకొచ్చారు. మరి.. దీనికి కాంగ్రెస్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి. ఒకవేళ.. హరీశ్ ఆరోపించినట్లుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ఖర్చు కోసమే ఈ భారీ మొత్తాన్ని సిద్ధం చేస్తున్నారన్న దానికి సంబంధించిన బలమైన ఆధారాలు లభిస్తే మాత్రం.. కాంగ్రెస్ కు కోలుకోలేనంత దెబ్బ తగలటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.