Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ హైకమాండ్ కు ఇంత ఇగోనా?

మారదా..ఎప్పటికి మారదా?ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా బుద్ధి మారదా? రాజకీయ ప్రత్యర్థులు అదే పనిగా ఛీకొట్టినా తన తీరు మార్చుకోదా?

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:35 AM GMT
కాంగ్రెస్ హైకమాండ్ కు ఇంత ఇగోనా?
X

మారదా..ఎప్పటికి మారదా?ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా బుద్ధి మారదా? రాజకీయ ప్రత్యర్థులు అదే పనిగా ఛీకొట్టినా తన తీరు మార్చుకోదా? ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్.. తర్వాతి కాలంలో మసకబారిపోవటానికి కారణం.. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. తోక జాడించే వారిని ప్రోత్సహించటం.. విభజించు పాలించు టైపులో వ్యవహారాలు నడిపే కాంగ్రెస్ అధినాయకత్వం మరోసారి తన తీరును ప్రదర్శించింది.

తెలంగాణ ఎన్నికల సమయంలో గులాబీ బిగ్ బాస్ పలు సందర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుపట్టారు. మన ముఖ్యమంత్రిని మనం డిసైడ్ చేసుకోవాలే కానీ.. ఎవరో ఢిల్లీలోకూర్చొని సీల్డ్ కవర్లో పెట్టి పంపించటమా? అంటూ టార్గెట్ చేశారు. ఇప్పటికి సీల్డ్ కవర్ సంస్క్రతి అవసరమా? అన్న ప్రశ్న తలెత్తే వేళ.. ఆ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళలో.. మెజార్టీ సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినంతనే.. సోమవారమే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అని ప్రకటన రావటం.. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించనున్నట్లుగా లీకులు రావటం తెలిసిందే.

గతానికి భిన్నంగా.. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని నాన్చకుండా.. వెంటనే తేల్చేయటంపై కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమైంది. అయితే.. కాంగ్రెస్ తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన రేవంత్ నుసీఎంగా ప్రకటిస్తూనే.. ఫిట్టింగ్ పెట్టేసింది. అప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ప్రకటించేసి.. ప్రమాణ స్వీకారం అంటూ హడావుడి చేసిన పార్టీ.. అంతలోనే ఉత్తమ్.. భట్టిలు ముఖ్యమంత్రి కుర్చీ కోసం తెర మీదకు రావటం చూస్తే.. కాంగ్రెస్ అధినాయకత్వం తన తీరును ఇప్పటికి మార్చుకోదా? అన్న భావన కలుగక మానదు.

నిజంగా ఉత్తమ్.. భట్టిని కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిసైడ్ అయితే.. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ.. ఏదో ఒక రచ్చ చేసి.. అతి కష్టమ్మీద ముఖ్యమంత్రి పదవిని అప్పగించినట్లుగా చేయటం మొదట్నించి అలవాటు. ఇప్పుడు అలాంటి ధోరణినే మరోసారి ప్రదర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా చూస్తే.. ఆ పార్టీ అధినాయకత్వానికి ఈగో పోదా? అన్న సందేహం కలుగక మానదు. ఓవైపు ఢిల్లీ నుంచి పార్టీ పెద్దల్ని పరిశీలకులుగా పంపి.. వారితో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ప్రోగ్రాం పూర్తి చేయని చెప్పి.. మరోవైపు సీఎం పదవి కోసం ఢిల్లీకి వస్తున్న భట్టి.. ఉత్తమ్ లను ఎంకరేజ్ చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.