Begin typing your search above and press return to search.

ఏపీలో ఏనాడో ఎత్తిపోయిన కాంగ్రెస్... శాశ్వత సమాధినే చిరునామా...!

అవును కాంగ్రెస్ నిండు పాలకుండ లాంటి ఏపీని రెండు ముక్కలు చేశాక ఇంకా ఎందుకు పుట్టగతులు ఉంటాయన్నది నిఖార్సు అయిన ప్రశ్నగానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 3:52 PM GMT
ఏపీలో ఏనాడో ఎత్తిపోయిన కాంగ్రెస్... శాశ్వత సమాధినే చిరునామా...!
X

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. ఇది సూటిగా జనాల నుంచి వస్తున్న ప్రశ్న. అవును కాంగ్రెస్ నిండు పాలకుండ లాంటి ఏపీని రెండు ముక్కలు చేశాక ఇంకా ఎందుకు పుట్టగతులు ఉంటాయన్నది నిఖార్సు అయిన ప్రశ్నగానే ఉంటుంది. కాంగ్రెస్ కి ఒకనాడు ఏపీ కంచుకోట. ఈనాడు మాత్రం కాంగ్రెస్ శిధిల భవనంగానే చూడాలని అంటున్నారు.

కాంగ్రెస్ కి రాష్ట్ర అధ్యక్షుడు అయినా మరొకరు అయినా ఒక్కటే. కాంగ్రెస్ కి అత్యధిక శాతం ఎంపీలను ఇచ్చి రెండు సార్లు కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రా జనాలకు శతకోపం పెట్టి మరీ దారుణంగా అడ్డగోలు విభజనను యూపీయే పెద్దలు చేశారు. కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది అని సగటు జనానికి బాగా తెలుసు.

అందుకే కంచుకోటలలో కాంగ్రెస్ కి 2014 నుంచి 2019 వరసగా వచ్చిన రెండు ఎన్నికల్లోనూ సమాధినే కట్టారు జనాలు. అలా శవాసనం వేసి ఉనికి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ కి ఊపిరులూదడం ఆ దేవుడి వల్ల కూడా కాదని ఏనాడో తేలిపోయిన వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎపుడు ఎన్నికలు వచ్చినా నోటాతో పోటీ పడుతూ ఉంటుంది.

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ అన్నట్లుగా కాంగ్రెస్ ఇవాళ దీన స్థితి ఉంది. ఒక విధంగా చెప్పలీ అంటే ఏపీలో కాంగ్రెస్ దుకాణం పక్కగా దివాళా తీసింది. నిజమే ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ అని అంతా ఒప్పుకుంటారు. అంతే కాదు దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ గా కూడా చరిత్ర చెప్పుకుంటారు.

ఇక కాంగ్రెస్ అంటేనే పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు అదే సంఖ్యలో గవర్నర్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఎంతో ఘనంగా చెప్పుకునే శకం అయితే ముగిసిన అధ్యాయం గానే చెప్పుకోవాలి

ఒకనాడి కాంగ్రెస్ క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది. కానీ ఆ వెన్నెలరోజులు ముగిశాయి ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్యగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. అలా ఖద్దరు పార్టీ నాయకుల మెడలోని కండువా దిగాలుగా నేలరాలింది.

ఇక మరో వైపు చూస్తే దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు.

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలు అయిపోయారు. అలా కనుక చూస్తే నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్నీ తానే స్వయంగా ఎలుగెత్తి చాటుకుంది.

ఇలా ఒక్కో నాయకుడి చిట్టా చూస్తే కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో లోక్ సభకు ఎంపీగా పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి. ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం.

ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు.. ఇకముందూ దక్కదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు, ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది చిన్న పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు

అలా కాంగ్రెస్ పార్టీ అన్నది చరిత్రలో కలసిపోయిన నేపధ్యంలో ఆ పార్టీని పైకి లేపాలని ఎవరు చూసినా అది సాధ్యమయ్యే సీన్ లేదు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అన్నది కూదా కలగానే చెప్పుకోవాలి. తెలంగాణాలో కాంగ్రెస్ రావడం వెనక ఎన్నో ఫ్యాక్టర్లు ఉన్నాయి.

అయినా సింపుల్ మెజారిటీయే దక్కింది. ఏపీలో అలా కాదు కాంగ్రెస్ ఎనాడో సమాధి అయింది. ఆ సమాధి నుంచి తిరిగి లేచి కూర్చుంటుంది అని ఎవరైనా అనుకుంటే హాస్యాస్పదమే అంటున్నారు. అందుకే కాంగ్రెస్ క్యాడర్ కూడా ఎక్కడా కనిపించని నేపధ్యం ఉంది.