Begin typing your search above and press return to search.

35–40 మంది పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా!

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సిట్టింగ్‌ స్ధానాలతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్నచోట

By:  Tupaki Desk   |   29 Aug 2023 6:19 AM GMT
35–40 మంది పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా!
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. పొరుగు రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే విజయాన్ని రిపీట్‌ చేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ లో అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలు వీడి ఐకమత్యంగా కదనోత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల్లోని కీలక నేతలు పార్టీలో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 119 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 1000కి పైగా వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నుంచి మిగతా నేతలంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. తొలి విడతగా విడుదల చేసే జాబితాలో 35–40 మంది సభ్యులు ఉంటారని అంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సిట్టింగ్‌ స్ధానాలతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్నచోట, ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న చోట అభ్యర్థులను ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. తొలి విడత జాబితాలో పార్టీ అగ్ర నేతలు.. రేవంత్‌ రెడ్డి (కొడంగల్‌), ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (హుజూర్‌ నగర్‌), ఉత్తమ్‌ పద్మావతి (కోదాడ), రఘువీర్‌ రెడ్డి (నాగార్జున సాగర్‌), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), భట్టి విక్రమార్క (మధిర), జీవన్‌ రెడ్డి (జగిత్యాల), జనగాం (పొన్నాల లక్ష్మయ్య), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), సీతక్క (ములుగు), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (ఖమ్మం) తదితరుల పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గాంధీ భవన్‌ లో ఆగస్టు 29న ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) భేటీ కానుంది. ఆశావహుల దరఖాస్తులను పరిశీలించి, పోటీ చేయగల సామర్థ్యాలు ఉన్న వారిని నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురిని పీఈసీ ఎంపిక చేయనుంది. తర్వాత స్క్రీనింగ్‌ కమిటీకి సిఫారసు చేయనుందని చెబుతున్నారు.

కాగా సర్వేలు, సీనియారిటీ తదితర అంశాల ఆధారంగా ఏకాభిప్రాయం ఉన్న 35–40 స్థానాల్లో ఒకే అభ్యర్థిని పీఈసీ ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి పంపి.. వారి ఆమోదంతో సెప్టెంబరు మొదటి వారంలో తొలి జాబితా విడుదల విడుదల చేస్తారని సమాచారం.

మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే 115 స్థానాలకు పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మరో నాలుగు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.