Begin typing your search above and press return to search.

13 ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ చర్చ.. 7 పై ఏకాభిప్రాయం?

ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 March 2024 4:32 AM GMT
13 ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ చర్చ.. 7 పై  ఏకాభిప్రాయం?
X

ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా మొత్తం 17 ఎంపీ స్థానాలున్న తెలంగాణలో 13 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. తాజాగా వీటిలోని ఏడు స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లు కలిసి నిర్వహించిన సమావేశంలో తెలంగాణ అభ్యర్థులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కం పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపా దాస్ మున్షీలు హాజరయ్యారు.

ఇంకా ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాల్లో ఏడింటిపైన నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన స్థానాలపై మరోసారి చర్చ జరపాలని భావించారు. ఖరారు చేసిన ఏడు స్థానాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ని చెబుతున్నారు. ఇంతకూ అభ్యర్థులు ఎవరంటే?

1. పెద్దపల్లి గడ్డం వంశీ

2. చేవెళ్ల రంజిత్ రెడ్డి

3. మల్కాజిగిరి సునీతా రెడ్డి

4. నాగర్ కర్నూల్ మల్లు రవి

5. అదిలాబాద్ ఆత్రం సుగుణ

6. సికింద్రాబాద్ దానం నాగేందర్

7. మెదక్ నీలం మధు

ఇక.. భువనగిరి టికెట్ పై చర్చ జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రాష్ట్ర కమిటీ ప్రతిపాదిస్తే.. దానికి బదులుగా కోమటిరెడ్డి లక్ష్మీకి టికెట్ కేటాయించాలన్న ప్రతిపాదన వచ్చింది. దీంతో ఈ అంశాన్ని తర్వాత సమావేశానికి వాయిదా వేశారు. ఇక.. ఖమ్మం.. వరంగల్.. హైదరాబాద్.. నిజామాబాద్.. కరీంనగర్ నియోజకవర్గాలకు ధీటైన అభ్యర్థుల్ని బరిలోకి దింపాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎంపీ ఎన్నికల్లో 12 - 13 స్థానాల్లో గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల్ని ప్రకటిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించటం తెలిసిందే. మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్.. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్.. నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డిలను ఖరారు చేయటం తెలిసిందే. మిగిలిన స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు.