Begin typing your search above and press return to search.

మ్యానిఫెస్టో కాదు... కాంగ్రెస్ హామీ ఇవ్వాల్సిందే...!

గత కొన్ని ఎన్నికలుగా చూస్తే పార్టీల మ్యానిఫేస్టోలకు ఏ మాత్రం విలువ ఉండడంలేదు.

By:  Tupaki Desk   |   5 April 2024 4:53 PM GMT
మ్యానిఫెస్టో కాదు...  కాంగ్రెస్  హామీ ఇవ్వాల్సిందే...!
X

గత కొన్ని ఎన్నికలుగా చూస్తే పార్టీల మ్యానిఫేస్టోలకు ఏ మాత్రం విలువ ఉండడంలేదు. మ్యానిఫెస్టోని ఆకర్షణీయంగా తయారు చేస్తారు. అందులో అన్ని వర్గాలకు తాయిలాలు కూర్చి పెడతారు. అలవి కాని హామీలు గుప్పిస్తారు.

తీరా అధికారంలోకి వస్తే సవాలక్ష సాకులు చెబుతారు. హామీలు మాత్రం పెద్దగా నెరవేర్చింది ఉండదు. ఇక ఖజానా సంగతి చూసుకోకుండా ఇచ్చే హామీలు చాలా ఉంటాయి. అలాగే రాజకీయ పరిస్థితులు కూడా హామీల అమలు విషయంలో చూసుకోరు.

దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేశంలో చూస్తే ఎన్డీయే కూటమి వర్సెస్ ఇండియా కూటమి గా పోరు సాగుతోంది. ఇండియా కూటమికి పెద్దన్న ఎవరూ అంటే అంతా మేమే అంటారు. కానీ టెక్నికల్ గా చెప్పుకుంటే కాంగ్రెస్ అనే చెప్పాలి. అలాంటపుడు ఇండియా కూటమి తరఫున ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేయకుండా ఒక పార్టీగా కాంగ్రెస్ రిలీజ్ చేస్తోంది.

ఇదే ఇపుడు అనేక సందేహాలకు చర్చలకు తావు ఇస్తోంది. ఈ ఎన్నికల మేనిఫెస్టో రేపటి రోజున కాంగ్రెస్ ఎలా అమలు చేయగలదు అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇండియా కూటమి గానే రేపు అధికారంలోకి రావాలి. అంతా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.

అపుడు కాంగ్రెస్ సొంతంగా ఒక పార్టీగా ఇచ్చిన హామీలకు ఎంతవరకూ విలువ ఉంటుంది అన్నది పెద్ద ప్రశ్న. అదే సమయంలో అలవి కానీ హామీలు ఇచ్చేశారు మేము ఆమోదించమని ఇండియా కూటమి భాగస్వాములు అంటే అవి అక్కడితో సరి అన్నట్లుగానే ఉంటుంది.

మరో వైపు చూస్తే కనుక కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అనేక చిత్ర విచిత్రమైన హామీలు ఉన్నాయి. దేశంలో ప్రతీ పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు వంతున చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. అంటే నెలకు ఎనిమిదిన్నర వేల రూపాయలు అన్న మాట. ఈ దేశంలో ఈ రోజుకీ నలభై నుంచి యాభై శాతం పేదలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

అలా చూస్తే 75 కోట్ల కుటుంబాలకు ఏటా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వంతున ఇవ్వాలీ అంటే అది ఖజానాకు ఎంత భారమో లెక్క వేశారా అన్నది మేధవుల ప్రశ్నగా ఉంది. ఇది లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక భారంగా పడనుంది అంటున్నారు. తెల్ల కార్డుదారులకు ఈ పధకం వర్తింపచేసినా ఈ నంబర్ ఇంతకంటే పెరుగుతుంది తప్ప తగ్గదు అని అంటున్నారు.

అలాగే ఈ తరహా హామీలు అనేకం ఉన్నాయి. మరి ఇవి కాంగ్రెస్ రేపు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా తాము పట్టుబట్టి వీటిని అమలు చేస్తామని గట్టిగా చెప్పగలిగి ఉండాలి. లేకపోతే నమ్మే జనాలు కూడా నమ్మరు. నిజానికి ఇలాంటి తాయిలాలకు జనాలు పడే రోజులు కూడా పోయాయి. వారు కూడా హమీలు తీర్చగలిగే అయి ఉంటేనే అట్రాక్ట్ అవుతున్నారు.

మరో వైపు చూస్తే మోడీ ప్రభుత్వం తాయిలాలకు వ్యతిరేకం అంటోంది. కాంగ్రెస్ చూస్తే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇస్తోంది. ఇపుడు దేశవ్యాప్తంగా హామీలు ఇస్తోంది. ఇలా హామీలు ఇవ్వడాన్ని కూడా మేధావులు విశ్లేషిస్తున్నారు. కొండకు తాడుకు కట్టి వస్తే కొండ లేకపోతే తాడు అన్నట్లుగా అధికారానికి రాలేమని భావించినపుడే భారీ హమీలు ఇస్తారు అని అంటున్నారు.

కాంగ్రెస్ తన సొమ్మేం పోయిందని ఇలాంటి హామీలు ఇస్తోందని, తీరా సింగిల్ గా తాను అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటే ఇలాంటి భారీ స్కీములకు తెర తీసేదా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. సో కాంగ్రెస్ హామీలకు మరిన్ని గట్టి హామీలు కావాలంటే. అదే అంతా అంటున్నది కూడా.