కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఇలా! ట్విస్ట్ ఏంటి అంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 40 నియోజకవర్గాలకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
By: Tupaki Desk | 20 Sep 2023 7:25 AM GMTతెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలెట్టిన పార్టీ ఇక అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ల కోసం పార్టీలోని ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 1006 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వడబోసింది. ఇప్పుడు ఢిల్లీలో జాతీయ స్థాయి స్క్రీనింగ్ కమిటీ తమ పని మొదలెట్టనుంది. నియోజకవర్గానికి కనీసం ఒకటి నుంచి ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను ఈ కమిటీ ఖరారు చేయనుంది.
అయితే అభ్యర్థులను ప్రకటించే క్రమంపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 40 నియోజకవర్గాలకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
ఈ నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ లేదు. కీలక నాయకులు, అగ్ర నేతలు, ప్రజల్లో, నియోజకవర్గంలో పట్టు ఉన్న నాయకులు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ముందుగా ఈ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు హైకమాండ్ సిద్ధమవుతోందని తెలిసింది. ఈ నెల చివరి వరకూ తొలి విడత జాబితా కింద 40 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించనుండటం ఖాయంగా కనిపిస్తోంది.
అనంతరం మరో రెండు విడతలుగా మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ఆస్కారముంది. 30 నుంచి 35 స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. కాబట్టి రెండో విడతగా ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని చెప్పాలి. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన ఇద్దరిలో ఒకరి పేరును అధిష్ఠానం త్వరలోనే నిర్ణయించనుంది.
ఇక చివరగా ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్న స్థానాలను కాంగ్రెస్ ప్రకటించనుంది. ముందుగా అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చి ఒక్క స్థానానికి ఒక్కరిని ఎంపిక చేసి తుది జాబితా ప్రకటించనుందని తెలిసింది. మరోవైపు తుమ్మల నాగేశ్వర రావు లాంటి దరఖాస్తు చేసుకోని నాయకులకూ టికెట్లు కేటాయించడంపై అధిష్ఠానం ఫోకస్ పెట్టిందని తెలిసింది.