Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు 10 ఎంపీ సీట్లు.. బీజేపీ అగ్ర నేత అంతర్గత సర్వే

ఇప్పుడు ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికలు చాలా కీలకం. అటు మిగతా మూడు కీలక రాష్ట్రాల్లో ఓడిపోయినా తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ తన పరువు నిలుపుకొంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 11:30 PM GMT
కాంగ్రెస్ కు 10 ఎంపీ సీట్లు.. బీజేపీ అగ్ర నేత అంతర్గత సర్వే
X

వచ్చే లోక్ సభ ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. మహా అంటే రెండు నెలల్లోపే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు విడిగా జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ కలిపి జరగనున్నాయి. అయితే, తెలంగాణ ఎన్నికలు కాస్త ప్రత్యేకం అనుకోవాలి. ఎందుకంటే ఏడాదిన్నర కిందటి వరకు ఇక్కడ అసెంబ్లీకి త్రిముఖ పోరు తప్పదనే భావన కనిపించింది. ఏడాదికిందటి వరకు కూడా బీఆర్ఎస్ దే పైచేయిగా భావించారు. చివరి ఆరు నెలల నుంచి మాత్రం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇక అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పి బీజేపీ మూడోస్థానానికి పరిమితం అయింది. హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు చెప్పిన బీఆర్ఎస్.. అనూహ్యంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికలు చాలా కీలకం. అటు మిగతా మూడు కీలక రాష్ట్రాల్లో ఓడిపోయినా తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ తన పరువు నిలుపుకొంది.

కాంగ్రెస్ దే జోరు?

ఎంపీ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తీసుకుంటున్న చర్యలు సైతం ప్రజాదరణ చూరగొంటున్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఆ పార్టీనే కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్నది కాదు.. బీజేపీ అగ్ర నేత అంతర్గత సర్వేలో వెల్లడైన నిజం. ఆయన కూడా సాదాసీదాగా సర్వే చేయలేదు.

600 మంది సర్వే టీంతో..

బీజేపీ అగ్రనేత సర్వేను చాలా పటిష్ఠంగా చేయించారు. ఇందుకోసం 600 మంది స్పెషల్ టీంను వినియోగించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రతిఫలించనున్నాయని ఆయన సర్వేలో తేలిందట. ఇందులో కాంగ్రెస్ 10 ఎంపీ సీట్లు (మెదక్ లో కేసీఆర్, లేదా ఆయన కుటుంబ సభ్యులు నిలవకుంటే) గెలుచుకుంటుందని స్పష్టమైనట్లుగా చెబుతున్నారు. బీజేపీకి ఇప్పటికి నాలుగు సీట్లు ఉండగా మరో రెండు పెరిగి ఆరు స్థానాల్లో గెలుస్తుందని ఆ సర్వేలో స్పష్టమైంది. మరోవైపు బీఆర్ఎస్ కేవలం మెదక్ కే పరిమితం కానుందని సమాచారం. వాస్తవానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4 స్థానాల్లో గెలిచాయి. ఇప్పుడంతా రివర్స్ కానుంది.

కాంగ్రెస్ కు దక్కే సీట్లివే..

ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, మల్కాజ్ గిరి, పెద్దపల్లి, జహీరాబాద్ (బీజేపీతో పోటాపోటీలో పైచేయి), మెదక్. కాగా, కాంగ్రెస్ గత ఎన్నికల్లో భువనగిరి (కోమటిరెడ్డి వెంకటరెడ్డి), నల్లగొండ (ఉత్తమ్ కుమార్ రెడ్డి), మల్కాజ్ గిరి (రేవంత్ రెడ్డి)లో గెలిచింది. వీరిలో రేవంత్ సీఎం కాగా, మిగతా ఇద్దరూ మంత్రులయ్యారు.

బీజేపీ గెలిచేవి ఇవే..

సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్. కాగా, ఇందులో చేవెళ్ల, మహబూబ్ నగర్ తప్ప మిగతా నాలుగు బీజేపీ సిటింగ్ స్థానాలు.