7 పీఎం: తెలంగాణ పుర ఎన్నికల్లో ఎవరికెన్ని?
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ హడావుడికి కారణమైన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 13 Feb 2026 8:41 PM ISTగడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ హడావుడికి కారణమైన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు చాలాచోట్ల పూర్తి కాగా.. కొన్నిచోట్ల మాత్రం పూర్తి కాలేదు. మరికొన్నిచోట్ల అధికారికంగా ఫలితాలు వెల్లడి కాలేదు. ఈ రోజు(శుక్రవారం) రాత్రి ఏడు గంటల సమయానికి తెలంగాణలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీ ఎన్ని వార్డుల్ని సొంతం చేసుకుంది? ఎన్ని మున్సిపాలిటీలను.. ఎన్ని కార్పొరేషన్లను సొంతం చేసుకుందన్న విషయంలోకి వెళితే..
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు కలుపుకొని మొత్తం 2996 వార్డులు ఉండగా.. అత్యధిక వార్డుల్ని అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ మధ్యనే ముగిసిన పంచాయితీ ఎన్నికల కంటే కూడా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక వార్డుల్ని సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్డుల్లో యాభై శాతం కంటే వార్డుల్లో (1490) విజయం సాధించింది. బీఆర్ఎస్ 763 వార్డుల్లో గెలిస్తే.. బీజేపీ 338 వార్డుల్లో విజయాన్ని నమోదు చేసింది. మజ్లిస్, కమ్యునిస్టు పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 400లకు పైగా వార్డుల్లో విజయాన్ని నమోదు చేశారు.
మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తం 116 మున్సిపాలిటీల్లో 90 మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకొని.. అధికార పార్టీ అధిక్యతను స్పష్టంగా ప్రదర్శించింది. బీఆర్ఎస్ 10 మున్సిపాలిటీలను సొంతం చేసుకోగా.. బీజేపీ 5 మున్సిపాలిటీల్లో విజయాన్ని సాధించింది. మజ్లిస్ ఒక మున్సిపాలిటీని సొంతం చేసుకొని.. మరో మున్సిపాలిటీలో అధికారం చేజిక్కించుకోవాలంటే తన సహకారం తప్పనిసరిగా చేసుకుంది. 11 మున్సిపాలిటీల్లో హంగ్ చోటు చేసుకుంది. ఇక్కడ స్వతంత్రులు కీలకభూమిక పోషించనున్నారు.
ఏడు కార్పొరేషన్ల విషయానికి వస్తే మొత్తం 414 వార్డుల్లో కాంగ్రెస్ 178 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీఆర్ఎస్ 55 వార్డులకే పరిమితమైంది. ఆసక్తికరంగా బీజేపీ 49 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన స్థానాల్లో మజ్లిస్.. సీపీఐ.. స్వతంత్రులు విజయం సాధించారు. రామగుండం, మంచిర్యాల, నల్గొండలో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న పరిస్థితి. కరీంనగర్ లో బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసింది. మొత్తం 66 వార్డుల్లో బీజేపీ 16 వార్డుల్ని సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ ఆరు, బీఆర్ఎస్ మూడు.. మజ్లిస్, స్వతంత్రులు కలిసి 41 వార్డుల్లో విజయం సాధించటం విశేషం. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగ్ పరిస్థితి. 60 వార్డుల్లో బీజేపీ 19, కాంగ్రెస్ 10 వార్డుల్ని గెలుచుకోగా..బీఆర్ఎస్ ఖాతాను తెరవలేదు.కొత్తగూడెం కార్పొరేషన్ కూడా హంగ్ పరిస్థితినెలకొంది. కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని పంచుకునే వీలుంది.
