Begin typing your search above and press return to search.

జగన్ మావిగన్ కి చెక్ పెడుతూ ప్రత్యేక హోదాతో కాంగ్రెస్

ఏపీలో షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029 మే నెలలో జరగనున్నాయి. అంటే బిగిసి మూడేళ్ళ సమయం ఉంది.

By:  Satya P   |   8 July 2026 9:07 AM IST
జగన్ మావిగన్ కి చెక్ పెడుతూ ప్రత్యేక హోదాతో కాంగ్రెస్
X

ఏపీలో షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029 మే నెలలో జరగనున్నాయి. అంటే బిగిసి మూడేళ్ళ సమయం ఉంది. అయితే విపక్షానికి మాత్రం ఆత్రంగా ఉంది. ప్రధాన పక్షం అయిన వైసీపీ అయితే ఓటమి తరువాత నుంచి కళ్ళు మూసుకుంటే అయిదేళ్ళూ ఇట్టే జరిగిపోతాయని అంటోంది. అలా రెండేళ్ళు గడవడంతో సగం దూరానికి వచ్చేశామని ఏకంగా ఎన్నికల ప్రణాళికలను కూడా చెబుతోంది. తాజాగా మావిగన్ మా నినాదం అని జగన్ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. టీడీపీ కూటమి అమరావతి అంటే మేము మావిగన్ తో జనం వద్దకు వెళ్తామని ఎవరిది అనుకూలమైన వాదన అన్నది జనాలు నిర్ణయిస్తారు అని జగన్ ప్రకటించారు. అంటే 2029లో మరోసారి రాజధాని విషయంలో రచ్చ సాగుతుందని వైసీపీ తేల్చేసినట్లు అయింది.

ప్రత్యేక హోదా అంటూ :

ఇక కాంగ్రెస్ కూడా 2029 ఎన్నికలలో తన మ్యానిఫేస్టో ఇదని చెబుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే జగన్ మావిగన్ స్లోగన్ పనిచేయదని అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చే చాన్స్ లేదని కూడా చెప్పేశారు. అలాగే టీడీపీ కూటమి పట్ల జనంలో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని నినాదంతో జనాల వద్దకు వెళ్తుందని అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చి ఏపీని ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చింతా మోహన్ చెప్పారు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, అలాగే విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అన్నీ అమలు చేస్తామని చెబుతూ జనం వద్దకు వెళ్తామని అన్నారు.

జగన్ కేసులు ఆలస్యం :

జగన్ జయలలిత కంటే గొప్పవారు కాదు కదా అని చింతా మోహన్ ప్రశ్నించారు. జయలలిత మీద కేసులను తొందరగా పరిష్కరించారని అలాగే జగన్ అక్రమాస్తుల కేసులను కూడా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలితకు ఒక న్యాయం జగన్ కి మరో న్యాయం చెల్లదని అన్నారు. రాజకీయ ఒత్తిడులకు న్యాయ వ్యవస్థ లొంగుతోందా అన్న అనుమానాలు జనంలో రాకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తూ అమాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి మండిపడ్డారు.

అభివృద్ధి ఎక్కడ :

ఏపీకి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కూటమి ప్రభుత్వం చెబుతోందని అయితే ఏ ఒక్క జిల్లాలోనూ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని ఆయన అన్నారు. మాటలు తగ్గించి పనులు చేసి అభివృద్ధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్ పార్టీగా ప్రతీ అంశాన్ని ప్రజా కోణంలో చూస్తూ ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన వైఖరితో ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన చెబుతున్నారు.

కాంగ్రెస్ లెక్క ఇదేనా :

ఇదిలా ఉంటే 2029లో కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావం సహజంగానే ఏపీ మీద పడుతుందని కూడా భావిస్తున్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలని జనం వద్దకు వెళ్తామని చెబుతున్నారు. 2014లో ప్రత్యేక హోదా అంశం ఏపీలో కీలకం అయింది. 2019లో కూడా అది ప్రభావం చూపించింది. 2029 లో మాత్రం అమరావతి వర్సెస్ మావిగన్ అని జగన్ అంటూంటే కాంగ్రెస్ ప్రత్యేక హోదాతో చెక్ పెట్టలని చూస్తోంది. అంతే కాదు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అన్న డిమాండ్ తో వైసీపీని ఇరకాటంలో పెట్టాలని ఆ పార్టీ వెనక ఉన్న ఓటు బ్యాంక్ ని తిరిగి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు.