కాంగ్రెస్ కి ఆక్సిజన్...దక్షిణం గాలులు ఏ వైపు ?
కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న వేళ వేసవి వడగాలుల నుంచి భారీ ఉపశమనం మాదిరిగా దక్షిణం నుంచి నైరుతి పవనాలు వీస్తున్నాయి.
By: Satya P | 19 May 2026 9:30 AM ISTకాంగ్రెస్ పార్టీకి ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న వేళ వేసవి వడగాలుల నుంచి భారీ ఉపశమనం మాదిరిగా దక్షిణం నుంచి నైరుతి పవనాలు వీస్తున్నాయి. చల్లని వాతావరణాన్ని తీసుకుని వచ్చి ఆశావహంగా ఉంచుతున్నాయి. కాంగ్రెస్ గడచిన పన్నెండేళ్లుగా రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. 2014లో 47 మాత్రమే ఎంపీ సీట్లు దక్కి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయింది. 2019లో చూస్తే ఆ నంబర్ కాస్తా 50 ప్లస్ అయినా అదే సీన్ రిపీట్ అయింది. కానీ 2024 లో మాత్రం సెంచరీకి దగ్గరగా కాంగ్రెస్ ఎంపీలు పెరిగారు. దాంతో పాటు ఇండియా కూటమికి 240 ప్లస్ ఎంపీలు రావడంతో అధికారానికి ఆమడ దూరంలోకి వచ్చామన్న తృప్తి కలిగింది.
దయా దక్షిణం :
కానీ ఇంతలోనే గత రెండేళ్ళుగా జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి చేదు ఫలితాలు వరసగా వచ్చాయి. హర్యానా మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ కి చుక్కెదురు అయింది. ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ కి మంచి బోణీ అయితే అందింది. అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దక్షిణ భారతం కాంగ్రెస్ ని పూర్తిగా కాపు కాసింది. కేరళంలో కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టి అధికారం దక్కించుకుంది. అయాచితంగా తమిళనాడులో టీవీకే గెలిచినా కాంగ్రెస్ మద్దతు అవసరం పడడంతో అక్కడ కొత్త మిత్రుడు దొరికినట్లు అయింది. దాంతో ఒక్క ఏపీ తప్ప సౌత్ మొత్తం కాంగ్రెస్ చేతిల్లోకి వచ్చినట్లు అయింది. ఆ విధంగా దక్షిణం కాంగ్రెస్ కి ఆక్సిజన్ పొలిటికల్ గా ఇచ్చినట్లు అయింది.
భారీ ఎంపీ సీట్లతో :
ఇక దక్షిణంలో 129 ఎంపీ సీట్లు ఉంటే ఇందులో ఏపీలో 25 తప్ప మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఆధిపత్యం రాజకీయంగా కొనసాగుతోంది. అంటే వందకు పైగా ఎంపీ సీట్లలో ధీమా కాంగ్రెస్ కి వచ్చింది అన్న మాట. ఈ దక్షిణం గాలులు ఇపుడు ఉతరంగా బలంగా వీచాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే రానున్న రెండేళ్ళలో వరసగా దేశంలోని డజన్ కి పైగా రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. 20276లో అందులో 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీ అలాగే ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ ఉంటే 2028లో త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, కర్ణాటక తెలంగాణా చత్తీస్ ఘడ్, మిజోరాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ వంటివి ఉన్నాయి. ఇందులో ఉత్తరాది పశ్చిమ ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారతంలో తెలంగాణా కర్ణాటక ఉన్నాయి. మరి దక్షిణం వైపు నుంచి బలంగా వీస్తున్న కాంగ్రెస్ అనుకూల పవనాలు ఉత్తరం నుంచి పశ్చిమం వైపుగా అలాగే ఈశాన్యం వైపుగా వీచి హస్తం పార్టీకి సమస్తమైన రాజకీయ లాభాలను కలిగిస్తాయా అన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ కి మొగ్గు :
ఇక దేశంలో మెల్లగా మార్పు వస్తోంది అని అంటున్నారు. అది 2027 అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అంత సులువు కాదని అంటున్నారు. అలాగే ఉత్తరాఖండ్ కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ కానీ బీజేపీకి టఫ్ ఫైట్ గానే ఉండొచ్చు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో చూస్తే ఒక చోట వ్యతిరేకత మొదలైతే అది అంతటా వ్యాపిస్తుంది. గుజరాత్ లో మాత్రం బీజేపీ బలంగానే ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ కే ఈ రోజుకీ బలం ఉంది. ఆప్ వీక్ అయితే తప్పకుండా అది కాంగ్రెస్ కే ప్రయోజనం చేకూరుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రాహుల్ గాంధీలో రోజు రోజుకీ ధీమా అయితే పెరుగుతోంది. చూడాలి మరి సౌత్ నుంచి అందుకున్న ఆక్సిజన్ తో కాంగ్రెస్ రేపటి భారతంలో ఏ రకంగా తన బలాన్ని పెంచుకుంటుందో.
