Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో గొంతు లేస్తోంది...డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ?

కాంగ్రెస్ పార్టీ అంటే సాధారణంగా ఒక అభిప్రాయం అందరికీ ఉంది. అదే అపరిమితమైన స్వేచ్చ ఆ పార్టీలో ఉంటుంది.

By:  Satya P   |   1 April 2026 8:30 AM IST
కాంగ్రెస్ లో గొంతు లేస్తోంది...డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ?
X

కాంగ్రెస్ పార్టీ అంటే సాధారణంగా ఒక అభిప్రాయం అందరికీ ఉంది. అదే అపరిమితమైన స్వేచ్చ ఆ పార్టీలో ఉంటుంది. ఎవరైనా తమ సొంత అభిప్రాయాలను ఏ వేదిక మీద అయినా హాయిగా చెప్పవచ్చు. అది కాంగ్రెస్ పార్టీలొ ప్లస్ అదే మైనస్ కూడా. అంతర్గత ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ని మించిన పార్టీ వేరొకటి లేదు. అయితే అసంతృప్తులు అయినా అసమ్మతులు అయినా పార్టీ వేదికల మీద నాలుగు గోడల మధ్యన చెబితేనే బాగుంటుంది. కానీ బాహాటం అయితే పార్టీ ప్రభుత్వం రెండూ ఇబ్బందుల్లో పడతాయని అంటున్నారు.

బడ్జెట్ సెషన్ లోనే :

ఈసారి బడ్జెట్ సెషన్ లో కాంగ్రెస్ కి కొంత ఇరకాటం ఏర్పడే విధంగా సన్నివేశాలు కనిపించాయి. అసెంబ్లీలో నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు సీఎం సొంత నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని అదే ఇతర ప్రాంతాలలో కాంట్రాక్టర్లకు పెండింగులో పెడుతున్నారని వాపోయారు. అంతే కాదు ఎమ్మెల్యేలు గెలవకపోతే సీఎం కానీ మంత్రులు కానీ ఎక్కడ అని లాజిక్ పాయింట్ లేవదీశారు. అంతటితో ఊరుకోలేదు, తన నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు సాగడం లేదని అచ్చం విపక్షం గొంతుకతో విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గం నిధులు ఇవ్వకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒక విధంగా కోమటిరెడ్డి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయని అంటున్నారు.

రాములమ్మ ఆవేశం :

ఇక శాసనమండలిలో చూస్తే ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఉద్యమ కారులకు ప్రభుత్వం చేసిన న్యాయం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. వారికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని రెండేళ్ళు అవుతున్నా ఇంకా వాటిని నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారని అలాగే ఉద్యమ కారులకు నెలకు పాతిక వేల రూపాయల గౌరవ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఉద్యమకారులు లేకపోతే సీఎం అయినా మంత్రులు అయినా ఉండేవారా అని ఆమె నిలదీసినంత పని చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ సొంత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రభుత్వం పడింది అని అంటున్నారు.

జీవన్ రెడ్డితో మొదలు :

ఇక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసి పార్టీ వదిలి వెళ్లారు. పార్టీలో ఉంటూ ఈ ఇద్దరూ ఒకింత అసంతృప్తితోనే ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అని అంటున్నారు. ఇంకా చాలా మంది తమలోపల అసంతృప్తిని దాచుకున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అన్నట్లుగానే ఈ పరిస్థితి కాంగ్రెస్ లో ఉందని అంటున్నారు. అయితే ఈ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయాలి. అలాగే బహిరంగ విమర్శలు చేయకుండా చూసుకోవాలి. ఇప్పటి నుంచే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే విపక్షాలకు ఇది ఆయుధంగా మారుతుందని గతానుభవాలను చూసిన వారు కాంగ్రెస్ లో పెద్దలుగా ఉన్న వారు హితైషులు చెబుతున్నారు.